News

వీసీ సీజా థామస్ పై పైశాచికంగా దాడి చేసిన SFI కార్యకర్తల అరెస్ట్

5views

శ్రీ శంకరాచార్య సంస్కృత కళాశాలలో జరిగిన హింసాత్మక ఘటనలు, వీసీ సీజా థామస్ పై దాడికి కారణమైన సీపీఎం అనుబంధ విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ కి చెందిన నలుగురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను మెవిన్, యదుకృష్ణన్, బాసిల్ మరియు విజేష్‌లుగా గుర్తించారు. ఈ ఘటనతో పాటు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకున్నారనే ఆరోపణలపై మరో 79 మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఆగస్టు 13న విశ్వవిద్యాలయ సిండికేట్ సమావేశం ముగిసిన అనంతరం వైస్ ఛాన్సలర్ డాక్టర్ సీజా థామస్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నుండి బయటకు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. దాదాపు 200 మందికి పైగా ఉన్న సమూహం తనను చుట్టుముట్టి, భౌతికంగా దాడి చేసి, క్యాంపస్ వదిలి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆమె తెలిపారు. తనపై దాడి చేసి, తలపై కొట్టి, జుట్టు పట్టుకుని లాగారని, అలాగే తన అధికారిక వాహనాన్ని కూడా తీవ్రంగా ధ్వంసం చేశారని ఆమె పేర్కొన్నారు.

అంతకుముందు రోజు, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వద్ద ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు వైస్ ఛాన్సలర్‌కు వ్యతిరేకంగా నిరసన తెలపడమే కాకుండా, వినూత్నంగా పాడె కట్టి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘర్షణలో వైస్ ఛాన్సలర్ వ్యక్తిగత సిబ్బంది, సిండికేట్ సభ్యులపై కూడా దాడి జరిగింది. ఈ ఘటనపై పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తనపై జరిగిన దాడి మరియు భద్రతా వైఫల్యంపై డాక్టర్ సీజా థామస్ రాష్ట్ర ముఖ్యమంత్రి వి.డి. సతీశన్, హోం మంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర పోలీస్ చీఫ్ మరియు ఉన్నత విద్యా కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. క్యాంపస్‌లో పోలీసులు ఉన్నప్పటికీ, తనను మరియు సిండికేట్ సభ్యులను కాపాడేందుకు తగిన ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆమె గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు సమాచారం అందించారు.
దాడి చేసిన గుంపులో బయటి వ్యక్తులు కూడా ఉన్నారని విసి గవర్నర్‌కు తెలియజేశారు. డాక్టర్ సీజా థామస్ ప్రస్తుతం ఎపిజె అబ్దుల్ కలాం సాంకేతిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా సేవలందిస్తూ, గవర్నర్ ఆదేశాల మేరకు శ్రీ శంకరాచార్య సంస్కృత సర్వకళాశాల అదనపు బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు.