News

సంస్కృత భాష విశిష్టత ఎనలేనిది: కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్

5views

తిరుపతి: ఆధునిక భారతంలో సంస్కృత భాషకు ఎంతో గొప్ప ప్రాధాన్యత ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన ఉత్కర్ష మహోత్సవం-2026ను ఆయన ప్రారంభించారు.

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా రెండు రోజుల పాటు ఈ మహోత్సవం కొనసాగనుంది. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా రచించిన 75 సంస్కృత భాషా పరిశోధన పుస్తకాలను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. అలాగే సంస్కృత అనువాద యాప్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని మూడు ప్రముఖ కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో మేధోమథనం జరుగుతోందన్నారు. భారతీయ జ్ఞానపరంపరతో పాటు ఆధునిక విజ్ఞాన, సాంకేతిక రంగాల్లోనూ సంస్కృత భాషకు విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నారు.

భారతీయ జ్ఞాన సంపదను భవిష్యత్ తరాలకు అందించడంలో సంస్కృత భాష కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు. విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారిస్తూ సంస్కృతాన్ని ఆధునిక అంశాలతో అనుసంధానం చేయడం అభినందనీయమని తెలిపారు.

ఉత్కర్ష మహోత్సవం ద్వారా సంస్కృత భాష, భారతీయ జ్ఞానపరంపరపై యువతలో మరింత ఆసక్తి పెరుగుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.