
దేశభక్తికి, క్రమశిక్షణకి, పట్టుదలకి, కార్య దక్షతకి, కార్య కుశలతకి మారుపేరు ఆరెస్సెస్ స్వయంసేవకులు. 1925 విజయదశమి పర్వదినాన మహారాష్ట్రలోని నాగపూర్లో ప్రారంభమైన ఆరెస్సెస్ శాఖ నేడు దశ దిశలా వ్యాపించి దేశంలోని అన్ని ప్రాంతాలకు, ప్రపంచంలోని వివిధ దేశాలకు ప్రాకిందంటే… దాని వెనుక వేలాది మంది స్వయంసేవకుల నిరంతర పరిశ్రమ, పట్టుదల, సేవానిరతి, దాగివున్నది. ఆరెస్సెస్ స్వయంసేవకుల కార్య నిబద్ధత అనేక సందర్భాలలో తరచుగా వెల్లడవుతూ ఉంటుంది.
ఎన్ని సమస్యలు ఎదురైనా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, ఆరోగ్యం సహకరించకపోయినా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులలోనైనా ఆరెస్సెస్ స్వయంసేవకులు తమ దైనందిన శాఖా కార్యక్రమాలలో తప్పక పాల్గొంటారు. “నమస్తే సదావత్సలే….” అంటూ విధిగా ప్రార్థన చేస్తారు. పెను తుఫానులోనూ, నడిసంద్రంలోనూ, ఎడారులలోనూ, పర్వత ప్రాంతాలలోనూ ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎంతటి పనిలో ఉన్నా నిర్దిష్ట సమయానికి తమ గంట సేపు శాఖా కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఓ తపస్సులా ప్రార్థన చేస్తారు.
ఇప్పుడు తాజాగా హిమాచల్ ప్రదేశ్లోని శ్రీ ఖండ్ మహాదేవ్ శిఖరంపై శ్రీ ఖండ్ మహాదేవ్ ఆలయం వద్ద 18500 అడుగుల ఎత్తులో స్వయంసేవకులు తమ తపస్సును, అదేనండీ… శాఖను కొనసాగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అది చూసిన వారందరూ స్వయంసేవకుల నిబద్ధతకు, కఠిన పరిస్థితులలో సైతం వారు కనబరచే కర్తవ్యనిష్ఠకు ఓహ్ అనకుండా వుండలేకున్నారు. ఆరెస్సెస్ విజయానికి ఇదే కారణమని ప్రశంసలు కురిపిస్తున్నారు. 18500 అడుగుల ఎత్తున్న శ్రీ ఖండ్ మహాదేవ్ శిఖరంపై గత కొన్ని సంవత్సరాలుగా శాఖ నడుస్తోంది. అది అత్యంత శీతల ప్రదేశం. చలికాలంలో అయితే ఉష్ణోగ్రతలు 4,5 డిగ్రీల దిగువకు పడిపోతాయ్. అలాంటి కఠిన పరిస్థితుల మధ్య కూడా క్రమం తప్పకుండా అక్కడి స్వయంసేవకులు సంవత్సరాలుగా శాఖ నడుపుతున్నారు. ఈ దృశ్యం దేశంలో ఎందరినో ఆలోచింపజేస్తోంది, అబ్బురపరుస్తోంది. ఎందరో స్వయంసేవకులకు ప్రేరణగా కూడా నిలుస్తోంది.





