
కశ్మీర్: జమ్ముకశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాం అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ముష్కరులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో నిర్భంద తనిఖీలు నిర్వహించాయి బలగాలు. వీరిని చూసి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
దీంతో ఎదురుకాల్పులు జరిగాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థకు ముగ్గురు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో అశ్రఫ్ మోల్పీ అనే పాత తీవ్రవాది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అమర్నాథ్ యాత్ర మార్గంలో జరిగిన ఎన్కౌంటర్ తమకు అతిపెద్ద విజయం అని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
సరిహద్దులో 200 మంది ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్లో చొరబడేందుకు 200 మంది ఉగ్రవాదులు సరిహద్దులో నక్కి ఉన్నట్టు ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. అయితే, గతంతో పోల్చితే ఉగ్రవాద చొరబాట్లు భారీగా తగ్గాయని తెలిపారు. అలాగే 2021 ఫిబ్రవరి నుంచి ఇరుదేశాల అంగీకారం ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం కూడా పకడ్బందీగా అమలవుతోందని చెప్పారు.
Source: EtvBharat





