
-
ఐరాసలో కోరిన భారత ప్రతినిధి
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లోని భారతీయులతో పాటు అమాయకులైన ఇతర దేశాల పౌరులను సురక్షితంగా, నిరంతరాయంగా తరలించాలని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి డిమాండ్ చేశారు. ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఉక్రెయిన్లోని పరిస్థితులపై మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్లకు విన్నవించుకున్నప్పటికీ సుమీలో చిక్కుకున్న తమ విద్యార్థులను తరలించేందుకు సురక్షిత కారిడార్ ఏర్పాటు కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
దాడులకు తక్షణమే ముగింపు పలకాలని భారత్ నిరంతరంగా కోరుతోందన్నారు తిరుమూర్తి. ఇరు దేశాల అధినేతలతో భారత ప్రధాని మోదీ మాట్లాడి.. తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చారని తెలిపారు. ఇరు పక్షాలు చర్చల మార్గానికి తిరిగి రావాలని సూచించినట్టు చెప్పారు.
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల కోసం 80 విమానాలకుపైగా నడిపినట్టు వెల్లడించారు. అందుకోసం సహకరించిన ఉక్రెయిన్, సరిహద్దు దేశాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ ఇప్పటికే ఉక్రెయిన్, దాని సరిహద్దు దేశాలకు ఔషధాలు, టెంట్లు, నీటి నిలువ ట్యాంకులు వంటి సామగ్రిని మానవతా సాయం కింద అందించినట్టు చెప్పారు.





