News

‘ఆపరేషన్ గంగ’ … 76 విమానాల్లో భారత్‌కు చేరిన 15,920 మంది

559views
  • పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధ కల్లోలంలో చిక్కుకున్న భారత విద్యార్థులు, పౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ ద్వారా వేలాదిమంది స్వదేశానికి చేరుకొంటున్నారు. ఆ దేశంలోని వేర్వేరు నగరాలల్లో ఉన్న వారు సరిహద్దులకు చేరుకుంటే.. అక్కడి నుంచి పొరుగు దేశాల్లోని ఎయిర్ పోర్టుల ద్వారా భారత్‌కు తీసుకొస్తోంది.

ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటి వరకు 76 విమానాల్లో 15,920 మందిని భారత్‌కు తీసుకొచ్చినట్టు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి ఎన్నెన్ని విమానాలలో ఎంత మందిని భారత్‌కు తీసుకొచ్చామన్నది వివరిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

రొమేనియా నుంచి 31 విమానాలలో 6,680 మందిని, పోలాండ్ నుంచి 13 విమానాలలో 2,822 మందిని, హంగేరి నుంచి 26 విమానాలలో 5,300 మందిని, స్లొవేకియా నుంచి 6 విమానాల్లో 1,118 మందిని భారత్‌కు చేర్చామని ఆయన వివరించారు.

ఆదివారం 11 ప్రత్యేక విమానాల్లో 2,135 మంది భారత పౌరులను ఉక్రెయిన్‌ నుంచి తిరిగి తీసుకువచ్చారు. మొత్తం మీద ఫిబ్రవరి 22 నుండి 66 ప్రత్యేక పౌర విమానాల్లో ఎయిర్‌లిఫ్ట్‌ చేయబడిన భారతీయుల సంఖ్య 13,852 కి చేరుకుంది. కాగా, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యార్థులు విడతల వారీగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఆదివారం మూడు ప్రత్యేక విమానాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 214 మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. ఏపి(109), తెలంగాణ(105) మంది విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు.

ఇప్పటి వరకు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఎఎఫ్‌) 10 సోర్టీల ద్వారా ఆయా దేశాలకు 26 టన్నుల రిలీఫ్‌ లోడ్‌ను తీసుకెళ్లి, 2056 మంది ప్రయాణికులను వెనక్కి తీసుకొచ్చారు. సోమవారం బుడాపెస్ట్‌ (5), సుసెవా (2), బుకారెస్ట్‌ (1) నుండి 1,500 మందికి పైగా భారత పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి ఎనిమిది ప్రత్యేక విమానాలు రానున్నాయి.

తాజాగా మరోసారి అలెర్ట్ జారీ

కాగా, ఉక్రెయిన్‌లో ఇంకా చిక్కుకుని ఉన్న వారిని వేగంగా స్వదేశానికి తరలించేందుకు ఆదివారం భారత ప్రభుత్వం తాజాగా మరోసారి అలెర్ట్ జారీ చేసింది. తక్షణం అక్కడ ఉన్న భారతీయులు అంతా తమ వివరాలతో ఒక గూగుల్ ఫారం నింపాలని సూచిస్తూ ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది.

ఉక్రెయిన్‌లో ఉన్నవ్యక్తి పేరు, వయసు, మెయిల్ ఐడీ, పాస్ పోర్ట్ నంబర్, ఉక్రెయిన్‌లో వారు ఉన్న సిటీ పేరు, ప్రస్తుతం ఉన్న లొకేషన్, ఉక్రెయిన్‌లో వాడుతున్న ఫోన్ నంబర్, భారత్‌లో వారికి సంబంధించిన వ్యక్తి ఫోన్ నంబర్, ఇంకా ఆ వ్యక్తితో ఒకే చోట ఎక్కువ మంది ఉంటే వారి సంఖ్యను గూగుల్ ఫామ్‌లో పొందుపరచాలని పేర్కొంది. ఈ వివరాల ఆధారంగా వారిని గుర్తించి స్వదేశానికి తీసుకురానున్నట్టు ఎంబసీ తెలిపింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి