News

బోటులో వెళుతూ కూడా లేటు చేయకుండా ఆరెస్సెస్ ప్రార్థన

1.1kviews

బోటు ప్రయాణంలో ఉన్న కొందరు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ దైనందిన కార్యక్రమం శాఖా సమయం కావడంతో ఆ బోటులోనే అందరూ కలిసి ఆర్ ఎస్ ఎస్ ప్రార్ధన చేసిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని భేడ్ ద్వారకలో చోటు చేసుకుంది.

ఈనెల 11 వ తారీకు నుంచి 13వ తారీకు వరకు గుజరాత్లోని అహ్మదాబాదులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభలు జరుగనున్నాయి. ఈ సభలకు వెళ్ళవలసిన ప్రతినిధులు కొందరు నెల్లూరు నుంచి బయల్దేరారు. వారితో పాటు విహారయాత్ర నిమిత్తం వారి కుటుంబ సభ్యులు కూడా బయలుదేరారు. వారి విహారయాత్రలో భాగంగా వారు భేడ్ ద్వారకలో ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆర్ ఎస్ ఎస్ లో జరిగే దైనందిన కార్యక్రమం ‘శాఖ’ సమయం అయింది. వెంటనే ఆ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆ పడవలోనే ప్రార్థన చేశారు. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల ఈ తరహా నిబద్ధత తరచుగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఆ నిబద్ధతే వారిని ఇన్నేళ్ళుగా విలక్షణంగా నిలిపింది.

రెండేళ్లుగా పరిమిత సంఖ్యలో ప్రతినిధి సభలు….

ప్రతి ఏటా మార్చి నెలలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి విచ్చేసిన సుమారు 1500 మంది ప్రతినిధులతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ జరుగుతుంది. అయితే కోవిడ్ కారణంగా 2020,21 లలో కేవలం 500 మందితోనే ఈ సమావేశాలు జరిగాయి. మిగిలిన వారందరూ వారి వారి కేంద్రాల నుంచే వర్చువల్ గా ఈ సమావేశాలలో పాల్గొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ భయం తగ్గడంతో ఈ ఏడాది అందరి ప్రతినిధులతో సమావేశం ప్రత్యక్షంగా జరుగనున్నది. ఈ సమావేశాల్లోనే ప్రతి ఏడాది ఆర్ ఎస్ ఎస్ కొన్ని తీర్మానాలను చేస్తుంది. వాటికి అనుగుణంగా తన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకొని ఆ దిశగా కార్యకర్తలకు ఈ సమావేశాలలో పెద్దలు మార్గదర్శనం చేస్తారు. అందుకు అనుగుణంగానే వారి వార్షిక యోజన, కార్యక్రమాలు ఉంటాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.