
నంద్యాల: ఏపీలోని కర్నూలు జిల్లా, నంద్యాల పద్మావతి నగర్ శ్రీకృష్ణుని ఆలయం వద్ద సక్షమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ‘సక్షమ్ భారత్ – సమర్థ భారత్’ పేరిట ఆదివారం చేపట్టిన ఈ కార్యక్రమంలో 36 మంది రోగులకు చెవికి సంబంధించిన వైద్య తనిఖీలు జరిగాయి. ముగ్గురికి శస్త్రచికిత్స, నలుగురికి వినికిడి యంత్రాలు అవసరం గుర్తించారు.


ఒక రోగికి వినికిడి యంత్రాన్ని శిబిరంలోనే పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక టు టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ ఎన్.వి రమణ మాట్లాడారు. ప్రజలు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను తప్పక వినియోగించుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజానికి సక్షమ్ స్వచ్ఛంద సేవా సంస్థ నిరంతరం కృషి చేస్తోందని ప్రశంసించారు. ఈ సందర్భంగా వైద్యుల సేవలను కొనియాడారు. సక్షమ్ స్థానిక అధ్యక్షుడు, ఇఎన్‌టి వైద్యుడు నేట్ల మహేశ్వర్ రెడ్డి, ఆడియాజిస్ట్ వసంత్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.





