News

అమెజాన్‌ అడ్డాగా విశాఖ నుంచి గంజాయి రవాణ

483views

విజయవాడ: విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి దేశంలో పలు ప్రాంతాలకు గంజాయి యథేచ్ఛగా సరఫరా జరుగుతోంది. విశాఖ నుండి వచ్చే గంజాయిపై ఇతర రాష్ట్రాల పోలీసులు, మాదకద్రవ్యాల నిరోధక బృందం (ఎన్‌సీబీ), ప్రత్యేక బృందాల నిఘా పెరగడంతో ఇప్పుడు స్మగ్లర్లు కొత్తదారులను ఆశ్రయిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో గంజాయి స్మగ్లర్లు ఏకంగా ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ను అడ్డాగా చేసుకుని విక్రయాలు సాగిస్తున్నారు. నిందితుల కోసం వేట సాగిస్తూ ఇద్దరు కొనుగోలుదారులను పోలీసులు అరెస్టు చేశారు. అమెజాన్‌కు నోటీసులు జారీ చేశారు. అమెజాన్‌ గ్వాలియర్‌ రెండు డెలివరీ హబ్‌ల ద్వారా ‘డ్రై స్టీవియా’ పేరిట గంజాయి విక్రయాలకు దుండగులు తెరలేపారు.

నిజానికి స్టీవియా అనేది చక్కెరకు ప్రత్యామ్నాయం. గ్లూకోజ్‌ తక్కువగా ఉంటుంది. కాబట్టి, మధుమేహులు టీ/కాఫీల్లో, స్వీట్లలో స్టీవియాను వినియోగిస్తుంటారు. ఆ పేరుతో ఇప్పటి వరకు రూ.1.10 కోట్ల విలువ చేసే గంజాయిని అమెజాన్‌లో దుండగులు అమ్మేశారు. గ్వాలియర్‌ పోలీసులు ఈ ముఠాకు చెందిన కల్లు పవయ్య, బ్రిజేంద్ర తోమర్‌లను అరెస్టు చేసి, 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని విశాఖ ఏజెన్సీ నుంచి దుండగులు ఈ-కామర్స్‌, కొరియర్‌ సంస్థల ద్వారా గంజాయిని గ్వాలియర్‌, భోపాల్‌, కోటా, ఆగ్రా నగరాలకు తరలిస్తున్నారని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి