శ్రావణ మాసం వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో జరిగే కన్వర్ యాత్రలో లక్షలాది మంది శివభక్తులు పాల్గొంటారు. గంగానది నుంచి పవిత్ర జలాన్ని తీసుకొచ్చి పరమశివుడికి జలాభిషేకం చేయడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం. ప్రతి భక్తుడు తనకు సాధ్యమైన విధంగా ఈ యాత్రను పూర్తి చేస్తాడు. కొందరు వాహనాల్లో వెళ్తే, మరికొందరు పాదయాత్రగా వందల కిలోమీటర్లు ప్రయాణిస్తారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఓ శివభక్తుడు చేపట్టిన కన్వర్ యాత్ర ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మోకాళ్లపై నడుస్తూ కఠిన యాత్ర
53 ఏళ్ల హర్పాల్ నాథ్ రామ్‌రాజ్ అనే భక్తుడు మోకాళ్లపై నడుస్తూ హరిద్వార్‌కు చేరుకుని, అక్కడి నుంచి గంగాజలాన్ని తీసుకుని నేపాల్‌లోని ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయానికి బయలుదేరాడు. సాధారణంగా కన్వర్ యాత్రలో భక్తులు భుజాలపై కావడిని మోసుకుంటూ లేదా నడిచి ప్రయాణిస్తారు. కానీ హర్పాల్ మాత్రం తన శరీరానికి ప్రత్యేకంగా ఒక ట్రాలీని కట్టుకుని, మోకాళ్లపై నడుస్తూ ఈ కఠినమైన యాత్రను కొనసాగిస్తున్నారు. 2026 శ్రావణ మాస కన్వర్ యాత్ర జులై 30న ప్రారంభమై, ఆగస్టు 11న ముగియనుంది. ఈ పవిత్ర కాలంలో గంగాజలాన్ని తీసుకువచ్చి శివలింగానికి అభిషేకం చేస్తే పరమశివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇదే నమ్మకంతో లక్షలాది మంది భక్తులు ప్రతి ఏడాది ఈ యాత్రలో పాల్గొంటుంటారు. అయితే హర్పాల్ యాత్ర మాత్రం భక్తి, సంకల్పం, సహనానికి ప్రతీకగా నిలుస్తోంది.
అత్యంత పవిత్ర క్షేత్రం
నేపాల్‌లోని ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయం ప్రపంచవ్యాప్తంగా శివభక్తులకు అత్యంత పవిత్ర క్షేత్రంగా వెలుగొందుతోంది. భక్తులు స్వయంగా తీసుకెళ్లిన పవిత్ర జలంతో అక్కడ శివుడికి అభిషేకం చేస్తే ఆకాంక్షలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. అయితే హర్పాల్ మాత్రం తనకు ఎలాంటి వ్యక్తిగత కోరికలు లేవని చెబుతున్నారు. కేవలం భోలేనాథ్‌పై ఉన్న అచంచలమైన భక్తితోనే ఈ కఠినమైన యాత్రను చేపట్టినట్లు పేర్కొన్నారు
ఇది మొదటి సారి కాదు
హర్పాల్ ట్రాలీని లాగుకుంటూ, మోకాళ్లపై ఒక్కో అడుగు ముందుకు వేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇది చాలా కష్టమైన యాత్ర అయినప్పటికీ ఆయన ఎక్కడా వెనుకడుగు వేయకుండా ఆయన తన సంకల్పాన్ని కొనసాగిస్తున్నారు. తన ప్రయాణం ముజఫర్‌నగర్, ఉజ్జయిని తదితర ప్రాంతాల మీదుగా నేపాల్ వైపు సాగనుంది. అయితే ఇది హర్పాల్ చేపట్టిన తొలి కన్వర్ యాత్ర కాదు. గతంలో కూడా ఆయన హరిద్వార్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర వరకు సుమారు 1,800 కిలోమీటర్ల దూరాన్ని ఇదే తరహాలో పూర్తి చేశారు. ప్రస్తుతం చేపట్టిన యాత్ర మాత్రం అంతకంటే ఎక్కువ దూరం, మరింత కఠినమైనది. అయినప్పటికీ భక్తితో ఎంతటి ఇబ్బందులను అయినా అధిగమిస్తానని ఆయన చెబుతున్నారు.
సాధారణంగా కన్వర్ యాత్రలో కొందరు భక్తులు అలంకరించిన కావడులను మోసుకుంటూ ప్రయాణిస్తారు. మరికొందరు పెద్ద పెద్ద పాత్రల్లో గంగాజలాన్ని తీసుకెళ్తారు. ఇంకొందరు నిరంతరం నడుస్తూ యాత్ర పూర్తి చేస్తారు. కానీ మోకాళ్లపై 2,400 కిలోమీటర్ల ప్రయాణం చేయడం అత్యంత అరుదైన విషయం. అందుకే హర్పాల్ యాత్ర చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. మార్గమధ్యంలో పలువురు భక్తులు ఆయనకు నీరు, ఆహారం అందిస్తూ యాత్ర పూర్తి చేసేందుకు దోహదపడుతున్నారు.





