
-
అక్కడ మద్యం, మాంసం అమ్మకాలు నిషేధం
-
యోగి సర్కార్ మరో కీలక నిర్ణయం
లక్నో: ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి చుట్టుపక్కల ఉన్న 22 వార్డుల ప్రాంతం పవిత్రస్థలం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఇకపై ఆ 22 వార్డులలో ఎటువంటి మద్యం అమ్మకాలు, మాంసం అమ్మకాలు జరగకూడదని తేల్చి చెప్పింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కృష్ణ జన్మస్థానాన్ని ఒక మతపరమైన పుణ్యక్షేత్రంగా ప్రకటించింది.
అలాగే మాంసం, మద్యం అమ్మకాలను నిషేధించింది. కృష్ణ జన్మభూమిని కేంద్రంగా ఉంచుతూ, మధుర మునిసిపాలిటీలోని 22 వార్డులతో కూడిన ప్రాంతాన్ని పవిత్ర తీర్థ ప్రదేశంగా గుర్తించామని.. మాంసం, మద్యం అమ్మకాలపై పూర్తీ నిషేధం ఉంటుందని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. మథురలో మాంసం విక్రయాలపై నిషేధాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఆగస్టు 30న ప్రకటనను జారీ చేసింది. కృష్ణ జన్మభూమి చుట్టూ ఉన్న 10 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఇప్పుడు మతపరమైన పుణ్యక్షేత్రంగా గుర్తించి త్వరలో అమలు చేయాలని భావిస్తున్నారు.
ఇంతకు ముందు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మథురలో మాంసాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించగా.. జిల్లా మొత్తం మాంసం, మద్యం విక్రయించడం బ్యాన్ అయి ఉంటుందని ఊహించుకున్నారు. కానీ, తాజా ప్రకటనతో, నగరంలోని ఒక నిర్దిష్ట ప్రాంతం, అది కూడా శ్రీకృష్ణ జన్మభూమి చుట్టూ 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాత్రమే మాంసం, మద్యం అమ్మకంపై నిషేధం ఉంటుందని స్పష్టమైంది.
భారతదేశంలోని అనేక ఇతర పవిత్ర ప్రదేశాలలో మాంసం, ఆల్కహాల్ అమ్మకంపై నిషేధం ఉంది. 2017 లో, సీఎం యోగి ప్రభుత్వం బృందావన్, బర్సానాలో మాంసాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. పవిత్ర దేవాలయాలైన వారణాసి, హరిద్వార్, రిషికేష్ చుట్టూ కూడా ఇలాంటి నిషేధాలు ఉన్నాయి. అమృత్ సర్ నగరంలో కూడా మాంసం, మద్యం అమ్మకం, వినియోగంపై నిషేధం ఉంది.
Source: NationalistHub





