ArticlesNews

వివేకుని సింహ గర్జనకు నేటికి 128 ఏళ్ళు

205views

రోజు హిందూ జాతి సింహగర్జన ప్రపంచానికి వినిపించిన రోజు. భారతీయులు అనాగరికులనే, అథములనే అభిప్రాయంతో ఉన్న పాశ్చాత్యులకు భారతదేశం యొక్క ఔన్నత్యం అవగతమైన రోజు. తమ ఆలోచనల కంటే, తమ ఆవిష్కరణల కంటే తమ అభివృద్ధికంటే భారత్ ఎంతో ముందున్నదని ఆ పాశ్చాత్య ప్రపంచం వినమ్రంగా అంగీకరించి తమ హర్షధ్వానాలను ప్రకటించిన రోజు.

తల్లి భారతి ప్రియ సుతుడు మిడిమిడి జ్ఞానపు అన్య మతాధికారుల అహంకారాన్ని దించి భారతమాత మణి కిరీట కాంతులను విశ్వ వేదికపై ప్రసరింపజేసిన రోజు. ఈరోజు పరమ పవిత్రమైన రోజు. భారత జాతి ఆత్మ గౌరవం పునరుత్తేజితమై ప్రపంచం ముందు పునః స్థాపితమైన రోజు. యావత్ ప్రపంచం భారత ఆధ్యాత్మిక శిఖరాగ్రాన్ని నిశ్చేష్టులై, నిరత్తరులై, నిరహంకారులై, నిగర్వులై, వినమ్రులై నిబిడాశ్చర్యంతో దర్శించిన రోజు ఈరోజు. సెప్టెంబర్ 11. స్వామి వివేకానంద చికాగో సర్వమత సమ్మేళనంలో భారత జాతి విశ్వరూపాన్ని ప్రదర్శించిన రోజు. భారత జాతి ఖ్యాతిని విశ్వవ్యాపితం చేసిన రోజు.

1893 సెప్టెంబరు 11 వ తేదీన అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో భారతజాతి చైతన్య దీప్తి, విజ్ఞాన ఖని, స్వాతంత్ర్య సమరభేరి, ఆధ్యాత్మిక విభూతి, అగ్ర యతి స్వామి వివేకానందులు తన అమర గళాన్ని వినిపించారు. ప్రారంభంలో “అమెరికా సోదర సోదరీమణులారా!” అంటూ ఆయన పలికిన మృదు గంభీర పలకరింపుకే ఆ విద్వత్ సభ యావత్తూ పరవశించిపోయింది. కరతాళ ధ్వనులతో మార్మ్రోగిపోయింది.

“నేను ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన సంస్కృతికి వారసుడను, సర్వమానవాళినీ తమ సహోదరులుగా భావించే సంస్కారవంతులున్న దేశం నుంచి వచ్చాను. ప్రపంచంలో ఎవరికి ఆకలైనా అన్నం పెట్టే అన్నపూర్ణ నా దేశం. మహోన్నత సంస్కృతీ చరిత్రలకు ఆలవాలం నా దేశం. “సర్వే భవంతు సుఖినః” అంటూ ప్రపంచంలోని సర్వ జీవుల సుఖ సంతోషాలకై అను నిత్యమూ ప్రార్ధించే లోకపావని నా దేశం. ప్రపంచానికి జ్ఞానాన్ని, శాంతి సౌఖ్యాలను ప్రసాదించిన జ్ఞానదాయిని నా దేశం” అంటూ సగర్వంగా వివేకానందుడు చేసిన ప్రకటనకు ఆ పండిత సభ పులకించిపోయింది. ఇక ఆ సమ్మేళనం సాగినన్నాళ్ళూ వక్తలందరి ఉపన్యాసాలూ అయిపోయాక వివేకానందుని ప్రసంగం అక్కడ తప్పనిసరి అయిపోయింది. ఎందుకంటారా? అలా చేస్తేనేగానీ, చివరలో ఆ యువ హిందూ సన్యాసి ప్రసంగం ఉంటుందంటేనేగానీ సభలో జనం నిలవని పరిస్థితి ఏర్పడింది. సభికులు ఆయన ప్రసంగానికి అంతలా ముగ్దులయ్యేవారు. యావత్ ప్రపంచం హిందూ వాణిని చెవులు రిక్కించి వినడం మొదలైంది ఆరోజే.

ఇంతగొప్ప ఆదరణా, గౌరవమూ, కరతాళ ధ్వనులూ, సన్మానాలు, సత్కారాలు, వివిధ దేశాలకు ఆహ్వానాలూ ఆయనకు అంత తేలిగ్గా వచ్చెయ్యలేదు. ఆయన ప్రయాణం నల్లేరు మీద బండినడక కాదు. ఆయన పొందిన ఆ గౌరవమర్యాదల వెనుకా, తన వ్యవహార శైలితో, శీల సంపదతో, వాక్పటిమతో తన మాతృభూమికి ఆయన సంపాదించిపెట్టిన గౌరవ మర్యాదల వెనుకా స్వామీజీ ఎదుర్కున్న అనేక కఠిన పరిస్థితులున్నాయ్. ఆయన కఠోర దీక్ష ఉంది. ఎన్నో కష్టాలకోర్చి, ఎన్నో త్యాగాలు చేసి ఆయన అక్కడికి చేరుకున్నారు.

కేవలం టిక్కెట్టుకు సరిపడా డబ్బులతోనే ఆయన అమెరికా చేరుకున్నారు. అక్కడకు వెళ్ళాక ఆయన భారత్ నుంచి తనతో తెచ్చుకున్న ఆహ్వాన పత్రికను ఎక్కడో పడేసుకున్నారు. ప్రపంచ మహాసభలు సెప్టెంబరులో ప్రారంభం కానుండగా ఆయన జూలై మాసంలోనే అమెరికా చేరుకున్నారు. తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బులు కూడా ఖర్చయిపోవడంతో పస్తులున్నారు. అక్కడి చలిని తట్టుకోలేక నానా అవస్థలు పడ్డారు. రైల్వే స్టేషనులోని ఒక ఇనుప పెట్టెలో ముడుచుకు పడుకున్నారు.

చివరికి బోష్టన్ చేరుకున్న స్వామికి అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జే హెచ్ రైట్స్ తో పరిచయం ఏర్పడింది. స్వామీజీతో మాట్లాడిన ప్రొఫెసర్ రైట్స్ స్వామీజీ ప్రజ్ఞా పాటవాలకు, వాక్పటిమకు ముగ్ధుడయ్యాడు. స్వామీజీకి సర్వమత సభలకై తానిచ్చిన పరిచయ పత్రంలో “ఈ ఉత్తరం తెస్తున్న వ్యక్తి మన దేశంలోని మేథావులు, పండితులు, శాస్త్రవేత్తలందరి కన్నా మిన్నయైనవాడు. వారందరూ కలసినా ఈయనకు సాటి రారు.” అని వ్రాశారంటేనే ఆయన స్వామీజీలోని ప్రతిభను ఎంతగా పసిగట్టాడో, వారి మాటలకు, చేతలకు ఎంతగా ప్రభావితుడయ్యాడో అర్థం చేసుకోవచ్చు.

అనేక దండయాత్రలు, పరాయిపాలకుల క్రూర కృత్యాలు, పోరాటాలతో అలసిపోయి ఆత్మవిస్మృతి చెందిన భారత జాతిని పునరుజ్జీవింపజేయడానికే అవతరించిన అవతారమూర్తి స్వామి వివేకానంద. ఆయన ఒక ఎగసిపడే కెరటం. ఆయన ఒక తేజో కిరణం. ఆయన ఉద్బోధ, ఆయన ప్రసంగాలూ భారత జాతికి ఎప్పటికీ ప్రేరక మంత్రాలు. “జగద్గురు భారత్” స్వామీజీ స్వప్నం. “ లే… మేలుకో… గమ్యం చేరేవరకూ విశ్రమించకు” అన్న ఆయన మాటలు నిర్జీవ దేహాలలో సైతం చలనం తెప్పించగల ప్రేరక మంత్రం. “నీవే దైవానివి. నీవే సర్వస్వానివి. నీవే సర్వ శక్తిమంతుడవు. విశ్వంలోని శక్తి సమస్తమూ నీలోనే దాగివుంది. ఆ శక్తిని ప్రేరేపించు. అద్భుతాలు సాధించు. నీవు పాపివి కాదు. నీవు అమృత పుత్రుడవు. అనన్య సామాన్యుడవు.” అని ఆయన భారత యువతకు ఉద్బోధించారు. వారి ఉద్బోధలు యావత్ భారత జాతికీ చైతన్య దీపికలు. వారు చూపిన బాటలో సాగి వారి స్వప్న సాకార కారకులమవుదామని ఈ పవిత్ర పర్వదినాన ప్రతినబూనుదాం. భారత్ మాతాకీ జయ్.

– శ్రీరాంసాగర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.