
దేశంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి నేడు ప్రసంగించారు. అతి తక్కువ సమయంలో వ్యాక్సిన్ ని తీసుకురావడం భారతీయ శాస్త్రవేత్తలు సాధించిన అతిపెద్ద విజయంగా మోడీజీ అభివర్ణించారు. గతంలో వ్యాక్సిన్ కి అనుమతులు లభించాలంటే దశాబ్దాలు పట్టేదని, కానీ ప్రస్తుత సంక్షోభ సమయంలో సంబంధిత రంగాలన్నీ యుద్ధ ప్రాతిపదికన పనిచేసి, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడి 2 రకాల వ్యాక్సిన్ లను అతి తక్కువ సమయంలో అందుబాటులోకి తేగలిగారని ఆయన పేర్కొన్నారు. నాసల్ వ్యాక్సిన్ (ముక్కులో వేసుకునే చుక్కలు) ను కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం కూడా ముమ్మరంగా సాగుతోందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
దేశంలో ఇప్పటివరకూ 23 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని, వీలైనంత త్వరగా దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తిచేసే దృఢ సంకల్పంతో ప్రభుత్వమున్నదని ఆయన వెల్లడించారు. “సెకండ్ వేవ్ ప్రారంభం కావడానికి ముందే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి వ్యాక్సినేషన్ పూర్తయింది. అలా జరగకుండా ఉండి ఉంటే ఎంత ఇబ్బంది కలిగి ఉండేది?” అని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ద్వారా దేశమంతటా ఉచిత వ్యాక్సినేషన్
దేశమంతటా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో జూన్ 21 నుంచి 18 ఏండ్లు నిండిన వారికందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు వేయడం జరుగుతుందని ఆయన ప్రకటించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్లు వేయించుకునే ఆసక్తి ఉన్నవారు అక్కడే వేయించుకోవచ్చని, మొత్తం వ్యాక్సిన్లలో 25% వ్యాక్సిన్లను ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయించనున్నామని కూడా ఆయన ప్రకటించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రతి డోసూ విలువైనదేనని, ప్రతి ఒక్క డోసూ అది వేయించుకున్న వారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుందని ఆయన పేర్కొన్నారు.
దీపావళి వరకూ ఉచిత రేషన్
ఇప్పటికే సుమారుగా 80 కోట్లమంది ప్రజలకు ఉచితంగా అందిస్తూ వస్తున్న రేషన్ ను దీపావళి వరకు కొనసాగించనున్నామని ఆయన వెల్లడించారు.
తప్పుడు వార్తలపై చర్యలుంటాయి – మీడియాకు ప్రధాని హెచ్చరిక
తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ప్రజలలో కోవిడ్ పైన, వ్యాక్సిన్ ల పైన భయాందోళనలు, అపోహలు కలిగేలా వ్యవహరిస్తున్న ఒక వర్గం మీడియాపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ” వ్యాక్సిన్ లపై ఒక వర్గం మీడియా చేసిన, చేస్తున్న దుష్ప్రచారం అనేక ప్రాణాలను హరిస్తోంది. అలాంటి తప్పుడు వార్తలపై ఇకమీదట కఠిన చర్యలు తప్పవు” అని ఆయన హెచ్చరించారు.





