
దేశంలో కొవిడ్ కేసులు కొద్దిగా తగ్గుముఖం పడుతున్నా.. బ్లాక్ ఫంగస్ మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్, బ్లాక్ ఫంగస్ చికిత్సల్లో ప్రధానంగా అలోపతి వైద్యంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ వైద్యంలోనూ కొవిడ్, బ్లాక్ ఫంగస్‌లను ఎదుర్కొనే సమర్థమైన చికిత్సలున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖతో పాటు రాష్ట్ర ఆయుష్ శాఖ కూడా ఈ మహమ్మారి వ్యాధులను నయం చేయడానికి అవసరమైన చికిత్స విధానాలను ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఆయుర్వేద, హోమియో, యునానీ వైద్యాల్లో కొవిడ్, మ్యూకర్ మైకోసిస్‌ల చికిత్స, నివారణకు సంబంధించి నిపుణులు ప్రత్యేక ఔషధాలను పరిచయం చేశారు. బ్లాక్ ఫంగస్‌పై ఆయుష్ బాగా పనిచేస్తోందని వారు చెబుతున్నారు. కొవిడ్ బాధితులకు కూడా ఈ వైద్య విధానాలు కచ్చితంగా ఊరటనిస్తాయని స్పష్టం చేశారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా నివారణలోనే కాకుండా చికిత్సలోనూ తోడ్పాటునందిస్తాయని పేర్కొన్నారు. అలోపతి వైద్యాన్ని వినియోగిస్తూనే.. ఆయుష్ వైద్య విధానాలను కూడా అనుసరించవచ్చని తెలిపారు. ఎటువంటి దుష్ఫలితాలు ఎదురు కావని వివరించారు. అయితే ఏదిపడితే అది… ఎలాపడితే అలా కాకుండా తప్పనిసరిగా నిపుణులైన డాక్టర్ల సూచనలు తీసుకునే తగిన వైద్య పద్ధతులను నిర్ణయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ లక్షణాలు స్వల్పంగా, మధ్యస్థంగా ఉన్న రోగులకు దివ్యంగా ఉపయోగపడే ఔషధం ఆయుష్-64. ఈ మాత్రను 15 రోజుల పాటు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి చొప్పున వాడాలి. దీన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆమోదించింది.





