News

కొవిడ్‌ నివారణలో వైమానిక దళం…..

481views

దేశ రక్షణలో ముందుండే భారత వైమానిక దళం.. కొవిడ్‌ వైరస్‌పైనా అవిశ్రాంత పోరాటం చేస్తోంది. దేశంలోని వేర్వేరు నగరాల్లో భారత వైమానిక దళానికి చెందిన విమానాశ్రయాలను నోడల్‌ కేంద్రాలుగా మార్చుకొని కరోనా అత్యవసర మందులు, వైద్య పరికరాలు, ఆక్సిజన్‌ ట్యాంకర్ల తరలింపులో వాయుసేన బృందాలు సేవలందిస్తున్నాయి. వైమానిక దళం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1443 చోట్లకు రవాణా విమానాలను నడిపింది.

కొవిడ్‌ను ఎదుర్కోవడంలో వినియోగించే సామగ్రిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు మరో 168 విమానాలను తిప్పింది. 13,791 మెట్రిక్‌ టన్నుల వైద్య సామగ్రిని వేర్వేరు రాష్ట్రాలకు తరలించింది. మహమ్మారి బాధితుల ప్రాణాలు నిలిపే క్రమంలో రహదారి మార్గంలో జాప్యాన్ని నివారించేందుకు 791 ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలకు తరలించాయి. మొత్తంగా 12.41 లక్షల నాటికల్‌ మైళ్ల దూరం వాయుసేన విమానాలు ప్రయాణించాయి. ఇందుకోసం సి-17, సి-130, ఏఎన్‌-32, ఐఎల్‌-76 విమానాలను ఎక్కువగా ఉపయోగించారు. దిల్లీ, అహ్మదాబాద్‌, లఖ్‌నవూల్లో డీఆర్‌డీవో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రుల్లో వాయుసేన వైద్య సిబ్బందే బాధితులకు సేవలు అందిస్తున్నారు. బెంగళూరులో వాయుసేన ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 100 పడకల కరోనా ఆసుపత్రిని సైతం నిర్వహిస్తున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.