News

రైతులు తమ ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకునేలా చేస్తాం – కేంద్ర ఆర్ధికమంత్రి సీతారామన్

627views

రైతులకు లాభసాటి ధర కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్‌ రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై ప్రస్తుతం కొనసాగుతున్న పరిమితులను తొలగిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీని కోసం జాతీయ స్థాయిలో చట్టం తీసుకుని వస్తామని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ విపణిలో లైసెన్స్‌ రాజ్‌కు అడ్డుకట్ట వేస్తామన్నారు. లైసెన్స్ పొందిన వ్యాపారులకు రైతులు అమ్మాల్సిన అవసరం లేదని, దేశవ్యాప్తంగా ఎక్కడ మంచి ధర వస్తే అక్కడే తమ పంటలు అమ్ముకోవచ్చని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించి ఈ-ట్రేడ్ విధానం బలోపేతం చేస్తామని చెప్పారు.

అలాగే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి కొత్త పథకం తీసుకొస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఆపరేషన్‌ గ్రీన్‌పథకం కింద పైలెట్‌ ప్రాజెక్టుగా రాయితీ అందించనున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ పునరుద్ధరణకు గానూ ఈ పథకం తీసుకొచ్చారు. ఇందుకోసం రూ.500 కోట్లు కేటాయించారు. కూరగాయలు, ఉల్లిపాయలు, పండ్ల సరఫరాకు ఈ పథకం వర్తిస్తుంది. దీని కింద ఆరు నెలల పాటు వీటి రవాణాకు 50 శాతం రాయితీ ఇస్తారు. శీతల గోదాముల్లో నిల్వ ఉంచుకున్నా ఆరు నెల పాటు రవాణాలో రాయితీ ఇవ్వనున్నట్లు సీతారామన్‌ ప్రకటించారు. దీంతో పాటు 1955 నాటి నిత్యావసర వస్తువుల చట్టంలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. వంట నూనెలు, నూనె గింజలు, పప్పులు, ఉల్లిపాయలు, బంగాళదుంపల నిల్వలపై నియంత్రణను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సమయాల్లోనే వీటిపై నియంత్రణ ఉంటుందని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.