ArticlesNews

రామతత్వమే పరిష్కారమార్గం

423views

సామాజిక రాజకీయ రంగాలకు నేటికీ శ్రీరాముడు ఆదర్శమని, సమాజం ఎదుర్కొంటున్న సకల సమస్యల పరిష్కారానికి రామతత్వాన్ని అవగాహన చేసు కోవడమే రాజమార్గంగా ప్రముఖ సాహితీవేత్త, హనుమద్ ఉపాసకులు డా॥ అన్నదానం చిదంబర శాస్త్రి ఉద్ఘాటించారు. మార్చి 17వ తేది భారతమాత తత్వ ప్రచార వేదిక వాత్సల్యభారతి, కాకినాడ శ్రీ చల్లా జగన్నాధ శాస్త్రి కళ్యాణమండపంనందు ఏర్పాటు చేసిన అభినందన స్ఫూర్తిదాయక కార్యక్రమంలో ఆయన సభకు మార్గదర్శనం చేసారు.

తన ప్రసంగం కొనసాగిస్తూ అన్నదానం వాత్సల్యానంద భారతి (పూర్వాశ్రమంలో వేదాంతం సంగమేశ్వర శాస్త్రిగా ప్రసిద్ధి) అణువణువూ భరతమాతకు అర్పించారన్నారు. అటువంటి అపురూప వ్యక్తి సాంగత్యం తనకు లభించడం అదృష్టంగా భావిస్తానన్నారు. రామమందిర నిర్మాణంలో ముఖ్యభూమికను తాను యంత్ర మంత్ర రూపంలో పాత్ర వహించగలగడం ఆ రామానుగ్రహమేనని ఆయన విశదం చేసారు. రామాయణం నేటికీ ఎందుకు ఆచరణీయం అవుతుందో సోదాహరణ పూర్వకంగా వారు వివరించారు.

అన్నమో రామచంద్రా అని ఎందుకంటామో వివరిస్తూ రాముడు అన్నానికి కారణమని, సకల ప్రాణికోటికి అది ఆధారమని కాబట్టి అన్నము అవసరము ఉన్నంత కాలము రాముడి అవసరము ఉంటుందని, ఈ విషయాన్ని సూడో సెక్యులరిస్ట్ లు,కమ్యునిస్ట్ లు, నాస్తికులు, జాతీయవాద వ్యతిరేకులు గ్రహించాలని శాస్త్రి హితవు పలికారు. రాముడిని మనస్సులో ఊహించుకుంటేనే ఎన్నో మంచిలక్షణాలు అలవడతాయని, ఇదే విషయాన్ని టి.వి రామాయణం దర్శకులు రామానంద సాగర్ ఒక సందర్భంలో చెబుతూ రామాయణం సీరియల్లో నటించిన నటులు వారికి ఉన్న చెడు అలవాట్లను క్రమంగా దూరం చేసుకున్నారని తెలిపారని శాస్త్రి చెప్పారు.

రామ శబ్దం ప్రాముఖ్యతను వివరిస్తూ అనేక రకాల రుగ్మతలను దూరంచేసే శక్తి శ్రీరామ శబ్దానికి ఉందని ఆధ్యాత్మిక సాహిత్య వేదాంత విష యాల కోణంలో డా॥ అన్నదానం ఆవిష్కరించారు. రామో విగ్రహవాన్ ధర్మః, మర్యాదా పురుషోత్తముడు, యజ్ఞ పురుషుడు వంటి ప్రత్యేకతలు శ్రీరామ చంద్రునికి ఉండబట్టే మిగిలిన అవతారాల కన్నా రామావతారానికి ప్రాముఖ్యత ఉందని చెబుతూ ప్రధాని నరేంద్రమోడీ రాముడిని ఆదర్శంగా చేసుకుని పరిపాలన చేస్తున్నందున ప్రపంచం భారత దేశాన్ని ఆశా కిరణంగా భావిస్తోందని తెలిపారు.

సభకు అధ్యక్షత వహించిన వాత్సల్యభారతి గౌరవాధ్యక్షులు ఎం.వి.కుమార స్వామి మాట్లాడుతూ దేశభక్తి, దైవభక్తి, మాతృభక్తిలను వివరిస్తూ పాఠశాల కేంద్రంగా చేస్తున్న కార్యక్రమా లను వివరించారు. ఆన్లైన్ ద్వారా సిద్ధాంతి అందం కుమార్ మాట్లాడుతూ వాత్సల్య భారతి సత్సంగ్ విశేషాలను తెలిపారు.

కన్యాకుమారిలోని వివేకానంద కేంద్ర తెలుగు రాష్ట్రాల సంపర్క్ ప్రముఖ్ చెన్నాప్రగడ నదాశివ మాట్లాడుతూ సంగమేశ్వరశాస్త్రి తదనంతరం వాత్సల్యానందభారతిగా తనదైన ముద్రను వేసి ఎందరినో సమాజానికి అందించారని వివరించారు. ‘యూత్ ఫర్ నేషన్’ నేషనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ జి.ఎస్.మూర్తి మాట్లా డుతూ సంగమేశ్వర శాస్త్రి (వాత్సల్యానంద భారతి స్వామి) చూపిన అమృత ప్రేమతత్వము ఆయననుచిరస్మరణీయుడిని చేసిందని చెబుతూ చెప్పారు. వాత్సల్యభారతి గౌరవాధ్యక్షులు కుమార స్వామి, ఉపాధ్యక్షులు మద్దాలి శ్రీనివాసరావు, కార్యదర్శి నరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి తదితరులు అన్నదానం చిదంబర శాస్త్రిగారిని సన్మానించారు.