ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు – 8 ; దర్శి చెంచయ్య

367views

ప్రకాశం జిల్లా కనిగిరి కి చెందిన దర్శి చెంచయ్య గారు చెన్నపురి పచ్చయప్ప కళాశాలలో ఎఫ్ ఏ చదివి అమెరికా వెళ్లి కాలిఫోర్నియా యూనివర్సిటీ నుండి వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ చదివి గదర్ పార్టీ వ్యవస్థాపకులైన డి చెంచయ్య గారు నాలుగున్నర సంవత్సరాలు దేశ విదేశీ జైళ్లలో శిక్ష అనుభవించారు. వారి జీవితమంతా ఒడిదుడుకుల మయం.

శ్రీ చెంచయ్య గారి తండ్రి వెంకటసుబ్బయ్య కనిగిరి వైశ్యులలో పెద్ద మనిషిగా పేరుగాంచారు. దర్శి చెంచయ్య గారు, వెంకట సుబ్బయ్య గారి ఐదుగురు కుమారులు మూడవ వాడు. ఆయనకంటే పెద్దవాళ్ళు అయిన ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు, చిన్న వాళ్ళయిన ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారు. నాలుగవ తరగతి వరకు కనిగిరి లోనే చదువు. అనంతరం పైచదువుల కోసం ఒంగోలు చేరారు చెంచయ్య గారు.

ఈలోగా కులవృత్తి వ్యాపారంలో తండ్రి వెంకటసుబ్బయ్య వ్యాపారంలో పెట్టినా చెంచయ్య లాభాలవేట సాగించలేదు. తండ్రి మందలించడం ఉన్నతవిద్య చదవటానికి కారణం అయ్యింది. ఒంగోలులో చెంచయ్య గారు చదివే రోజుల్లో హెడ్మాస్టర్‌గా కాళిదాసు వెంకటసుబ్బయ్య గారు ఉండేవారు, ఆయన చండశాసనుడు. విద్యార్థులకు ఆయనంటే హడల్. ఎలాగోలా మెట్రిక్యులేషన్ పాసు కావటం కష్టమైంది. చెంచయ్యకు ఒంగోలులో ఉండే నల్లమల్లి వరదరాజులతో స్నేహం ఏర్పడింది. చెంచయ్యతో ఆ కాలంనాటి బెంగాల్ విభజన, స్వదేశీ ఉద్యమాల గురించి చర్చించుకునే వారు. వరదరాజులు కారణంగా చెంచయ్యకు బౌద్ధమతం పట్ల ఆసక్తి కలిగింది. ఒంగోలు మిషన్ హైస్కూల్ నుండి మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు, మద్రాసు పచ్చయప్పా కళాశాలలో ఇంటర్మీడియట్ చేరాడు. విదేశాలలో చదివినవారికి పెద్ద ఉద్యోగాలు లభిస్తాయనే కోరికతో అమెరికా వెళ్లాలని నిర్ణయించుకొని, వైశ్య సంఘం వారి సహాయంతో ఒక వెయ్యి రూపాయలతో అమెరికా ప్రయాణం అయ్యారు. ఒంగోలు నుండి మద్రాసు నుండి జపాన్ మీదగా ప్రయాణం చేసారు.

అమెరికాలో చెంచయ్య గారి విద్యాభ్యాసం నల్లేరుపై నడక అయింది. 12000 మైళ్ళనుండి వచ్చాడని ప్రిన్సిపాల్‌తో మొదలు విద్యార్థులవరకు ఆదరంగా చూసేవారు. బోర్డింగ్ హౌస్ లో ఇతర విద్యార్థులు తాగేవారు, వ్యభిచార గృహాలకు వెళ్లేవారు, చెంచయ్య వీటన్నిటికీ దూరంగా ఉండేవారు. ఆయన ప్రవర్తన ఇతర విద్యార్థులను ఆకర్షించేది. పీడితులైన నా రైతు సోదరులను శాశ్వతదాస్యానికి గురి చేయవలసినదేదా? ఎప్పటికీ అట్లా చేయనని బ్రిటిష్ సామ్రాజ్య విషవృక్షాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేస్తానని, భారత స్వాతంత్ర సంపాదనకంటే నా జీవిత పరమావధి మరొకటి లేదు ఇదే నా జన్మ సాఫల్యం అన్న లేఖ బ్రిటీష్ పార్లమెంట్లో చదవబడింది. లాలా హరదయాళ్, పృధ్వి సింగ్, సోహన్ సింగ్ జోషి, లాహిరి మొదలగు పదిమంది విప్లవయోధులతో 1913 జనవరిలో శాన్‌ఫ్రాన్‌సిస్కో నగరంలో గదర్ పార్టీ స్థాపించారు. గదర్ పార్టీ ఆదేశంమేరకు బర్మా ప్రయాణమయ్యారు. చెంచయ్య 1917లో చదువు పూర్తికాకుండానే భారతదేశం రమ్మంది గదర్ పార్టీ. చెంచయ్య పార్టీ ఆదేశం మేరకు ఎలాగో ప్రొఫెసర్ని ఒప్పించి ముందుగా పరీక్షలు పెట్టేటట్టు చేసి అగ్రికల్చర్ పట్టా అమెరికన్ యూనివర్సిటీ నుండి తీసుకొని తన లక్ష్యం నెరవేర్చుకొని జపాన్‌కు స్టీమరులో వచ్చారు. జపాన్‌లో “సన్ ఎట్ సన్” ను దర్శించారు. మార్గమధ్యంలో బ్యాంకాక్ రైల్వేస్టేషన్ వెళుతున్న చెంచయ్యను పోలీసులు అరెస్టు చేశారు. సముద్రప్రయాణంలో చిత్రహింసలకు గురిచేశారు. ఇద్దరు ఇద్దరిని కలిసి సంకెళ్ళతో బంధించారు. జతలు జతలుగా మలవిసర్జనకు పంపేవారు. కొంతమందిని సింగపూర్ మిలటరీకి అప్పగించారు. కొంతమందిని కాల్చి చంపివేశారు.

చెంచయ్య రికార్డు పై గల అట్ట మీద ఎర్ర సిరాతో “చాలా దౌర్జన్యం” చేస్తాడు అని వ్రాసి ఉండేది. ఆ రిమార్క్ చెంచయ్యకు చాలా సౌలభ్యంగా ఉండి ఆయన జోలికి ఎవరూ వచ్చేవారు కాదు. ఆ తర్వాత చెంచయ్య గారిని తిప్పని జైల్ అంటా లేదు. ఒక సంవత్సరం తర్వాత చెంచయ్య గారిని ఢిల్లీ జైలుకు మార్చారు. తర్వాతై ఎలాంటి కేసు పెట్టకుండా కన్ననూరు జైలుకు తరలించారు. కోయంబత్తూరు జైలులో ఆరు నెలలు గడిపిన తర్వాత 1919 డిసెంబర్ లో విడుదల చేశారు.

జైలునుంచి విడుదలయ్యాక మద్రాసు భవనంలో బస ఏర్పాటు చేసుకున్నారు చెంచయ్య గారు. ఆ తరువాత హింసను ప్రేరేపించే గదర్ పార్టీని వీడి, అహింసను చాటిచెప్పే మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడిచారు. జాతీయోద్యమంలో పాల్గొన్నారు. విప్లవకారుడిగా ఉన్న దర్శి చెంచయ్య గాంధీజీ నాయకత్వాన కాంగ్రెస్ ఉద్యమంలోకి వచ్చారు. 1929 గాంధీగారి అడుగుజాడల్లో ఖద్దరు ధరించారు. భార్య అన్నపూర్ణమ్మ కాంగ్రెస్ సేవలో తరించింది.

ఒక దశలో చెంచయ్యగారు రాజకీయాలు వదిలి సంఘ సంస్కరణ వైపు మరలారు. పడుపువృత్తి నిర్మూలన, రజస్వలానంతర వివాహాలు, అనాధ సంరక్షణ, అస్పృశ్యత నిర్మూలన వంటి సామాజిక రుగ్మతలవైపు దృష్టిసారించారు. అన్ని ప్రాంతాలు పర్యటించాక మద్రాసు చేరారు. మద్రాసు సింప్పన్ కంపెనీలో పని చేసేటప్పుడు కార్మిక సంఘానికి అధ్యక్షుడుగా ఉన్న నేపథ్యంలో మళ్లీ అరెస్టయ్యారు. వేలూరు జైలులో ఉండి 1942 జూన్ లో విడుదలయ్యారు. విడుదలయ్యాక కార్మిక సంఘాలతో చురుకుగా పనిచేశారు. ఆ సందర్భంలో 1946-47 ఫిబ్రవరిలో అరెస్టయి 1947 ఆగస్టు 14న జైలు నుండి విడుదల అయ్యి, 1948 జులై 19 నుండి రాజకీయాలనుండి, కార్మికసంఘాలనుండి పూర్తిగా తప్పుకున్నట్లు ప్రకటించారు. వయసు మీద పడటం ఆర్థిక బాధలు, వ్యాధులు అందుకు కారణం. 1964 డిసెంబరు 30 తేదీన ఆయన కాలధర్మం చెందారు.