News

డోలో విక్రయాలకు తాయిలాలు నిజం కాదు

419views

* రూ.1,000 కోట్ల తాయిలాలపై ఐపీఏ వివరణ

డోలో-650 ట్యాబ్లెట్‌ విక్రయాలు పెంచుకోడానికి, ఆ ఔషధ తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్‌, వైద్యులకు రూ.1,000 కోట్ల విలువైన తాయిలాలు ఇచ్చిందనే ఆరోపణలను ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అలయన్స్‌ (ఐపీఏ) తోసి పుచ్చింది.

ఈ మేరకు నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) కి నివేదిక సమర్పించింది. ‘దీనిపై కంపెనీ యాజమాన్యంతో మాట్లాడాం, కంపెనీ నుంచి వివరణ కూడా తీసుకున్నాం. ఒక ఏడాది కాలంలో ఒక బ్రాండు ఔషధంపై రూ.1,000 కోట్లను ఉచితాల రూపంలో ఖర్చు చేశారనడం సరికాదు’ అని ఈ నివేదికలో పేర్కొంది.

‘మైక్రో ల్యాబ్స్‌ టర్నోవర్‌ రూ.4,500 కోట్లు కాగా, అందులో దేశీయ అమ్మకాల వాటా రూ.2,500 కోట్లు. దేశీయ అమ్మకాలపై పెట్టిన ఖర్చు గత నాలుగేళ్ల సగటు చూస్తే రూ.200 కోట్లు మాత్రమే. అందువల్ల కేవలం డోలో-650 అమ్మకాలను పెంచుకోడానికి ఒక ఏడాదిలోనే రూ.1,000 కోట్లు ఖర్చు చేసిందనేది నమ్మదిగిన విషయంగా లేద’ని ఐపీఏ వివరించింది. డోలో-650 ట్యాబ్లెట్ ‌ను వైద్యులు ఇష్టం వచ్చినట్లు రోగులకు సిఫారసు చేశారని, ఈ ట్యాబ్లెట్‌ ధరపై నియంత్రణ లేదనే ఆరోపణలు కూడా నిజం కాదని ఐపీఏ పేర్కొంది. ‘కోవిడ్‌’ ముప్పు సందర్భంగా ఐసీఎంఆర్ ‌తో సహా కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డోలో- 650 ట్యాబ్లెట్‌ వినియోగాన్ని ఆమోదించించాయని.. ఈ ట్యాబ్లెట్‌ 2016 నుంచి ఎన్‌పీపీఏ- ధరల నియంత్రణ జాబితాలో ఉన్నట్లు’ కూడా ఐపీఏ గుర్తు చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.