
* వరదల కారణంగా ముప్పులో సింధూ నదీ లోయ నాగరికత ఆనవాళ్లు….
* పాక్ ప్రభుత్వ నిర్లక్ష్యమూ తోడైంది
* ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు రద్దయ్యే ప్రమాదం
ప్రకృతి విపత్తులకు కుప్పకూలిన అలనాటి సింధు నాగరికత ఆనవాళ్లు, మళ్లీ అదే ప్రకృతి ప్రకోపానికి ఇవాళ విలవిల్లాడుతున్నాయి. పాకిస్థాన్‌ను ముంచెత్తిన వరదలు చారిత్రక మొహంజదారోకు ముప్పుగా పరిణమించాయి. అటు వానలు, వరదలకు ఇటు స్థానికులు, ప్రభుత్వ నిర్లక్ష్యం తోడవటంతో మొహంజదారో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు రద్దయ్యే ప్రమాదంలో పడింది.
సింధూ నది ఒడ్డున 5 వేల సంవత్సరాల కింద విలసిల్లిన నాగరికతకు సాక్ష్యాలు ఈనాటి మొహంజోదారోలోని శిథిలాలు. నాటి మానవ విజ్ఞానానికి ప్రతీకగా కొనియాడుతూ వీటిని ప్రపంచ వారసత్వ సంపదగా 1980లో యునెస్కో గుర్తించింది. “మానవాళి చరిత్రలోని అత్యంత పురాతన అద్భుత మూడు నాగరికతల్లో సింధూలోయ నాగరికత ఒకటి. ప్రణాళికబద్ధంగా ఇటుకలతో నిర్మించిన కట్టడాలు, స్నానాల గదులు, మురుగునీటి కాల్వలు, బావులు… అన్నీ కూడా మెరుగైన సివిల్ ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, సౌకర్యాలకు అద్దం పడుతున్నాయి” అని యునెస్కో కీర్తించింది. నేటి పాకిస్థాన్‌లో అధికభాగం, భారత్‌లోని గుజరాత్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లో కొంతభాగం మేర ఈ మొహంజదారో నాగరికత వెలిసింది. ఇరాన్ సరిహద్దుల దాకా ఇది విస్తరించింది.
వరదలతో ఉక్కిరిబిక్కిరై..
కొద్దిరోజుల కిందట పాకిస్థాన్ అనూహ్య వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైంది. ముఖ్యంగా సింధ్ ప్రాంతం. మొహంజదారో పురాతత్వ స్థలాలున్న ప్రాంతంలో 77 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది. వారసత్వ సంపదగా భావిస్తున్న అనేక చోట్ల గోడలు కూలిపోయాయి. బురద కొట్టుకు వచ్చింది. ఈ ప్రకృతి విలయానికి తోడు… మానవ తప్పిదాలు కూడా చారిత్రక కట్టడాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. స్థానిక భూస్వాములు డ్రైనేజీ, ఇతర నీటి సరఫరా పైపులైన్లను మొహంజదారో ఛానల్ చారిత్రక కట్టడాలవైపు మళ్లించారు. ఫలితంగా వారసత్వ సంపద ప్రమాదంలో పడింది.
తక్షణమే ప్రభుత్వం దీనిపై దృష్టిసారించి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలంటూ స్థానిక క్యూరేటర్ ఇటీవలే లేఖ రాశారు. లేదంటే మొహంజదారో ప్రపంచ వారసత్వ గుర్తింపును కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి వరద వస్తే 5వేల సంవత్సరాలుగా నిలిచి ఉన్న ఈ శిథిలాలు పూర్తిగా నేలమట్టమవ్వొచ్చని పురాతత్వశాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రభావాన్ని చూడటానికి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పాకిస్థాన్‌లో పర్యటించారు.
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ప్రాంతాలను సరిగ్గా నిర్వహించకపోయినా, నిబంధనల మేరకు కాపాడకపోయినా ఆ గుర్తింపును యునెస్కో వెనక్కి తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా 167 దేశాల్లో 1100 ప్రాంతాలకు వారసత్వ సంపద గుర్తింపులున్నాయి. ఇటీవలే… నిర్వహణ లోపాల కారణంగా బ్రిటన్‌లోని లివర్‌పూల్ సిటీ, ఒమన్‌లోని ఒరిక్స్ శాంచురీ, జర్మనీలోని ఎల్బే లోయలకు గుర్తింపును రద్దు చేసింది. మొహంజోదారోకు కూడా అదే ప్రమాదం ముంచుకొస్తోంది.





