
-
కేరళ గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు
తిరువనంతపురం: పాలక్కాడ్‌లో ఇటీవల జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్త సంజిత్ (27) హత్యపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) దర్యాప్తును కోరుతూ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కేరళ అధ్యక్షుడు కె.సురేంద్రన్ మంగళవారం కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను కలిశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఏఎన్‌ఐతో మాట్లాడిన సురేంద్రన్, ఈ హత్య వెనుక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్‌డీపీఐ) హస్తం ఉందని ఆరోపించారు. ‘కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సలహా ఇవ్వాలని గౌరవనీయ గవర్నర్‌ను అభ్యర్థించాము.
కేరళ పోలీసులు, ప్రభుత్వ అధికారులు నిందితులకు మద్దతు ఇస్తున్నారు. నిందితులను గుర్తించి, 24 గంటల తర్వాత కూడా పోలీసులు ఇంకా ఎస్‌డీపీఐ కార్యకర్తలను అరెస్టు చేయలేదు. ఇందులో తీవ్రవాదుల ప్రమేయం ఉంది’ అని సురేంద్రన్ ఆరోపించారు. ఇంకా… ఆయన మాట్లాడుతూ ఎన్‌ఐఏ విచారణకు డిమాండ్ చేస్తూ బీజేపీ కేరళ యూనిట్ కూడా హోంమంత్రి అమిత్ షాను సంప్రదిస్తుందని ఆయన చెప్పారు.
‘15 రోజుల వ్యవధిలో, ఇది రెండో హత్య. త్రిస్సూర్, పాలక్కాడ్‌లో సంజిత్‌ని అతని భార్య ముందే నరికి చంపారు. రెండు కేసులలో, ఎస్‌డీపీఐ ప్రమేయం ఉంది’’ అన్నారాయన. పాలక్కాడ్‌లోని ఎలుప్పుల్లికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త సంజిత్(27) తన భార్యతో కలిసి బైక్‌పై వెళ్తుండగా అడ్డగించి నరికి చంపిన విషయం పాఠకులకు విదితమే.
Source: Organiser





