
తీవ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై భువనేశ్వర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు షేక్ ఇమ్రాన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా సాగుతున్న డిజిటల్ తీవ్రవాద కోణాన్ని మరోసారి బయటపెట్టింది.
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని గంగా నగర్ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్, గతంలో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసేవాడు. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ఇటీవల కొంతమంది అనుమానితులను విచారించినప్పుడు, వారి సోషల్ మీడియా కార్యకలాపాల ద్వారా ఇమ్రాన్ పేరు వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు, ఒడిశా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సహకారంతో భువనేశ్వర్‌లో ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇమ్రాన్ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు టెలిగ్రామ్ వంటి వేదికల ద్వారా మతోన్మాదాన్ని ప్రేరేపించే కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. నిందితుడు పాకిస్థాన్ ఆధారిత హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.ముఖ్యంగా, ఒక విదేశీ ఏజెంట్ కి దేశ వ్యతిరేక సమాచారాన్ని చేరవేస్తున్నాడనే బలమైన అనుమానాలు ఉన్నాయి.
నిందితుడి నుంచి ఒక స్మార్ట్‌ఫోన్ మరియు ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని డేటాను విశ్లేషించగా, అతడు పలు రహస్య సోషల్ మీడియా గ్రూపులలో సభ్యుడిగా ఉన్నట్లు, ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నట్లు ఆధారాలు లభించాయి. ఇతను కేవలం ప్రచారానికే పరిమితమయ్యాడా లేక ఏదైనా కుట్రలో భాగస్వామి అయ్యాడా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
భువనేశ్వర్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం, పోలీసులు ఇమ్రాన్‌ను ట్రాన్సిట్ రిమాండ్‌పై ఢిల్లీకి తరలించారు. అక్కడ అతడిని లోతుగా విచారించి, ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మరికొంతమందిని గుర్తించే అవకాశం ఉంది. ఈ ఘటనతో ఒడిశా వంటి ప్రాంతాల్లోనూ స్లీపర్ సెల్స్ లేదా ఆన్‌లైన్ రాడికలైజేషన్ విస్తరిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.





