కాబూల్ నుండి నీటిని పంపిన ఆఫ్ఘన్ అమ్మాయి – అయోధ్య రామ మందిర నిర్మాణ స్థలంలో సమర్పించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

ఒక ఆఫ్ఘన్ అమ్మాయి పంపిన కాబూల్ నది నీటిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం (అక్టోబర్ 31, 2021) అయోధ్యలోని రామజన్మభూమి ప్రదేశంలో సమర్పించారు. ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఓ బాలిక కాబూల్ నది నుండి నీటిని సేకరించి అయోధ్యలో రామ మందిరం నిర్మితమవుతున్న పవిత్ర స్థలంలో ఆ నీటిని సమర్పించాల్సిందిగా కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ నీటిని పంపింది.
“రామ మందిర నిర్మాణ స్థలం వద్ద కాబూల్ నది మరియు గంగా జలాలను సమర్పించడానికి నేను అయోధ్యకు వచ్చాను” అని యోగి ఆదిత్యనాథ్ మీడియాకు తెలిపారు.
అయోధ్యతో తనకు ముడిపడివున్న గొప్ప ధార్మిక అనుబంధాన్ని ఆ బాలిక తన ఈ చర్య ద్వారా ప్రకటించిందని అదిత్యనాథ్ ఈ సందర్భంగా తెలిపారు. బాలిక చర్యను ఆయన శతధా ప్రశంసించారు.
దీపావళి వేడుకల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 75 జిల్లాల నుంచి సేకరించిన 12 లక్షల “దియాలు” (మట్టి దీపాలు) ఈ సంవత్సరం అయోధ్యలో వెలిగించనున్నట్లు రాష్ట్రం ప్రకటించింది.





