ArticlesNews

తెలుగు కళామతల్లి సిగలో విరిసిన సిరిమల్లి దేవులపల్లి

135views

“మావి చిగురు తినగానే కోయిల పలికేనా?” అంటూ గడుసుగా ప్రశ్నించినా, “ఆకులో ఆకునై, పూవులో పూవునై” అంటూ ప్రకృతిలో తానొకడై పరవశించిపోవాలని ఆకాంక్షించినా, “గోరింట పూచింది కొమ్మ లేకుండా” అంటూ ప్రతి తెలుగింటా గోరింట పూయించినా, “ఆరనీకు మా యీ దీపం” అంటూ ఆంధ్రదేశమంతటా  కార్తీక దీపాలు వెలిగించినా అది భావ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రికే చెల్లింది. ప్రకృతి సోయగాల వర్ణనకు, ప్రణయ కవిత్వానికి, భావ కవిత్వానికి చిరునామా దేవులపల్లి కృష్ణశాస్త్రి. అందుకే “తెలుగు కళామతల్లి సిగలో విరిసిన సిరిమల్లి దేవులపల్లి” అన్నాడు ఓ మనసున్న సుకవి.

దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం  దగ్గరలోని రావు వారి చందపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1 న జన్మించారు. ఆయన తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్ఠి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. పిఠాపురం హైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నంలు ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకునేవారు. 1918లో విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ వచ్చ్చారు. పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టాడు.
ఆ కాలంలో వ్యావహారిక భాషావాదం, బ్రహ్మ సమాజం వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్నాయి. శ్రీ కృష్ణశాస్త్రి తన అధ్యాపకవృత్తిని వదలి బ్రహ్మసమాజంలో చురుకుగా పాల్గొన్నారు. అదే సమయంలో సాహితీ వ్యాసంగం కూడా కొనసాగించారు. 1920లో వైద్యంకోసం ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి “ఆకులో ఆకునై, పూవులో పూవునై” అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం. “కృష్ణపక్షం కావ్యం” రూపు దిద్దుకుంది. ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసం, ఊర్వశి వంటి కవితలు ఈ ఖండకావ్యసంపుటిలో ఉన్నాయి. 1922లో సంభవించిన భార్యా వియోగం ఆయన కవితలను మరింత వేదనా భరితం చేసింది.

తరువాత మళ్ళీ వివాహం చేసుకొని, పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా చేరాడు. కాని పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదు. కృష్ణశాస్త్రి ఆ ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఎందరో కవులతోనూ, పండితులతోనూ పరిచయాలు కలిగాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు ఆయనను వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించారు. సంఘ సంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే “ఊర్వశి” అనే కావ్యం వ్రాశారు.

1929లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్ తో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1933-41 మధ్య కాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టారు. 1942లో ప్రముఖ సినీ నిర్మాత బీ. ఎన్. రెడ్డి ప్రోత్సాహంతో మల్లీశ్వరి చిత్రానికి పాటలు వ్రాశారు. తరువాత అనేక చిత్రాలకు సాహిత్యం అందించారు. 1957లో ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించారు.

భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి…  బీ. ఎన్. రెడ్డి ప్రోత్సాహంతో ‘మల్లీశ్వరి (1951)’తో చిత్రరంగంలో అడుగుపెట్టారు. సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారు. ఆపాత మధురమైన కృష్ణశాస్ర్తి సాహిత్యం ఇక్షురసార్ణవం వంటిదని శ్రీశ్రీ శ్లాఘించారు. లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం – కృష్ణశాస్ర్తి పాటల్లోని ప్రధాన లక్షణాలు. భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని వ్రాసిన కవి. ఆత్మ నివేదన, ఆరాధన గల భక్తిగీతాలు కూడా అనేకం.

‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యవ వడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) వ్రాశారు. ముఖ్యమైన జాబితాలో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు … శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి.

రాజమకుటం, సుఖదుఃఖాలు, కలిసిన మనసులు, అమెరికా అమాయి, గోరింటాకు మొదలైన చిత్రాల్లో 170 పాటలు మాత్రమే వ్రాసిన కృష్ణశాస్ర్తి, ఈ పన్నెండుగురు పథనిర్దేశకుల్లోనూ తక్కువ పాటలు వ్రాసిన కవి.

గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరుపొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యం కారణంగా మూగవోయింది. కానీ ఆయన రచనా పరంపర కొనసాగింది. అతనికి అనేక సన్మానాలూ ప్రశంసలూ లభించాయి. 1980  ఫిబ్రవరి24న శ్రీ కృష్ణశాస్త్రి కన్నుమూశారు.

అమృతవీణ అనే గేయమాలిక (1992), అమూల్యాభిప్రాయాలు అనే వ్యాసావళి, బహుకాల దర్శనం (నాటిక), ధనుర్దాసు పేరుతో నాలుగు భక్తీ నాటికలు, 4 భాగాల కృష్ణశాస్త్రి వ్యాసావళి, మంగళకాహళి పేరుతో అనేక దేశభక్తి గీతాలు, శర్మిష్ఠ  పేరుతో 6 శ్రవ్య (రేడియో) నాటికలు, శ్రీ ఆండాళ్ళు తిరుప్పావు కీర్తనలు (1993), మేఘమాల అనే సినిమా పాటల సంకలనం (1996), శ్రీ విద్యావతి పేరుతో శృంగార నాటికలు, యక్షగానాలు, అతిథిశాల వంటి సంగీత రూపకాలు, మహతి వంటివి వారు జీవించి వుండగానూ, మరణానంతరము కూడా విడుదలైన వారి వివిధ రచనలు.

తరాలెన్ని మారినా , ఏండ్లు ఎన్ని గడచినా కృష్ణశాస్త్రి సాహిత్యం ప్రజల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది . ఎద లోతుల్లో లలిత భావాల సుమాలను పూయిస్తూనే ఉంటుంది. వారి కలం నుంచి జాలువారిన అక్షర సుమ బాలలు తేనియలను పంచుతూనే ఉంటాయి. పరిమళాలను వెదజల్లుతూనే ఉంటాయి. ఆ అక్షరాలలోని సౌకుమార్యానికి, లాలిత్యానికి ఆహా అని పరవశించని హృదయముండదు. కృష్ణశాస్త్రి సాహిత్యం అజరామరం. అది ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో కృష్ణశాస్త్రి స్థానం పదిలం.

* నేడు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతి

సేకరణ : శ్రీరాంసాగర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.