News

నకిలీ నోట్ల దొంగలు షేక్‌ నూర్‌ బాషా, ఖాజా, ఖీసీంలను పట్టించిన చికెన్‌ పకోడి!

795views

అనంతపురం: చికెన్‌ పకోడి.. నకిలీ నోట్ల దొంగలు షేక్‌ నూర్‌ బాషా, ఖాజా, ఖీసీంలను పోలీసులకు పట్టించింది. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురానికి చెందిన షేక్‌ నూర్‌ బాషా, ఖాజా, ఖీసీంలు బంధువులు. సులువుగా డబ్బు దొరికే మార్గాలను అన్వేషించారు. అందులో డబ్బులను ప్రింట్‌ చేయడం కూడా ఒక మార్గం అని అనుకున్నారు. యూట్యూబ్‌లో డబ్బులు ఎలా ముద్రించాలో తెలుసుకున్నారు. నకిలీ నోట్ల తయారీకి కావాల్సిన వస్తువులను సమకూర్చుకున్నారు. రూ.100 నోట్లు ముద్రించి మార్కెట్లో మార్పిడి చేయాలని భావించారు.

అప్పటికే కొన్ని ప్రాంతాల్లో తక్కువ మొత్తంలో 100 రూపాయల నోట్లను మార్పిడి చేశారు. నూర్‌ బాషా జొన్నగిరి గ్రామం వెళ్లి చికెన్‌ పకోడీ తిన్నాడు. చికెన్‌ పకోడీ బండి నిర్వాహకుడికి తాము ముద్రించిన 100 నోటు ఇచ్చాడు.. ఐతే ఆ వందనోటు మారదని వేరేది ఇవ్వాలని అడిగాడు. నూర్‌ బాషా ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం మొదలైంది. పోలీసులు అక్కడికి చేరుకొని ఖాన్‌ను తనిఖీ చేయగా దొంగనోట్లు బయటపడ్డాయి.

అతడి దగ్గర 30 దాకా రూ.100 నకిలీ నోట్లు గుర్తించారు. పోలీసు స్టేషన్‌ కు తీసుకుని వెళ్లి అతడిని విచారించగా మొత్తం బయటపెట్టాడు. యూట్యూబ్‌ లో నేర్చుకొని దొంగనోట్లు ముద్రించామని తెలిపారు. వజ్రకరూర్‌, గుంతకల్‌, మద్దికెర ప్రాంతాల్లో నకిలీ నోట్లు చలామణీ చేసినట్టు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. నకిలీ నోట్లు తయారు చేసేందుకు ఉపయోగించిన జిరాక్స్‌ మిషన్‌, ప్రింటర్‌, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

Source: Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి