News

లడాఖ్‌లో పారాట్రూపర్ల అద్భుత విన్యాసాలు

576views

ది లడాఖ్‌లోని మంచుతో నిండిన పర్వత ప్రాంతం.. ఇంతలో అక్కడికి చేరుకున్న సీ-130జే సూపర్‌ హెర్క్యులస్‌ విమానం నుంచి ఒక్కొక్కరుగా పారాట్రూపర్లు ర్యాంపు అంచు నుంచి కిందకి దూకుతున్నారు. సైనికుల ధైర్యసాహసాలకు నిదర్శనమైన ఇలాంటి విన్యాసాలు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను అబ్బురపరిచాయి. శుక్రవారం రాజ్‌నాథ్‌ లడాఖ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సైనిక విన్యాసాలను ఆయన తిలకించారు. ముఖ్యంగా పారాట్రూపర్ల విన్యాసాలు కేంద్ర మంత్రిని మంత్రముగ్ధుడిని చేశాయి. తూర్పు లడాఖ్‌ ప్రాంతంలోని స్టాక్నా ప్రాంతంలో పారాట్రూపర్లు విమానం నుంచి దూకిన దృశ్యాలను ఆయన వీక్షించారు.

‘లేహ్‌ సమీపంలోని స్టాక్నాలో పారాడ్రాపింగ్‌తోపాటు భారత సైనికుల ఇతర విన్యాసాలను చూశాను. దీంతోపాటు వారిని కలిసే అవకాశం నాకు దక్కింది. సైనికుల ధైర్యసాహసాలు చూసి నేను గర్వపడుతున్నాను’ అని రాజ్‌నాథ్‌ ట్వీట్‌ చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోను స్పెషల్‌ ఫోర్సెస్‌ మాజీ అధికారి మేజర్‌ సురేంద్ర పూనియా ట్వీట్‌ చేశారు. ‘మేం సిద్ధంగా ఉన్నాం. ఈరోజు తోటి పారాట్రూపర్లు తమ నైపుణ్యాలను లడాఖ్‌లో పరీక్షించుకున్నారు. జైహింద్‌’ అని పేర్కొన్నారు. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. భారత సైనికుల ధైర్యసాహసాలను సామాజిక మాధ్యమాల్లో కొనియాడుతున్నారు. ‘జోష్‌ ఈజ్‌ హై’,’లాంగ్‌ లివ్‌ ఇండియన్‌ ఆర్మీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.