News

అమూల్య లియోన్‌కు నక్సల్స్ తో సంబంధాలున్నాయ్ – కర్ణాటక సీఎం యడ్యూరప్ప

999views

సీఏఏ వ్యతిరేక ఆందోళనలో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన యువతి అమూల్య లియోన్‌కు గతంలో నక్సల్స్‌తో సంబంధాలున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప అన్నారు. ఆమెకు బెయిల్‌ వచ్చే అవకాశాలు కూడా లేవన్నారు. తాజా ఘటనపై మీడియాతో మాట్లాడుతూ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

‘రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా కొన్ని సంస్థలు కుట్రలు పన్నుతున్నాయని ఈ ఘటనతో స్పష్టమైంది. ఇలాంటి సంస్థలపై చర్యలు తీసుకోకపోతే వీటికి అంతమనేదే ఉండదు. అమూల్య వెనకాల ఉన్న సంస్థలను దర్యాప్తు చేస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయి. ఇక ఆ యువతికి గతంలో నక్సల్స్‌తో సంబంధాలున్నట్లు తెలిసింది. అమూల్యకు శిక్ష పడాల్సిందేనని ఆమె తండ్రే స్వయంగా చెప్పారు. దీంతో అమూల్యకు బెయిల్‌ వచ్చే అవకాశం కూడా లేదు. ఈ కేసులో ఆమెకు తగిన శిక్ష పడేలా చూస్తాం’ అని యడియూరప్ప తెలిపారు.

అమూల్య ఇంటిపై దాడి

అమూల్య వ్యాఖ్యలు టీవీ, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆమెపై నిరసనలు వెల్లువెత్తాయి. ఆమె వ్యాఖ్యలను నిరసిస్తూ పలు సంస్థలు నేడు ధర్నా చేపట్టాయి. మరోవైపు చిక్కమంగళూరులోని యువతి ఇంటిపై కొందరు ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఆమె కుటుంబానికి భద్రత కల్పించారు.

అమూల్యకు 14 రోజుల కస్టడీ

కాగా పాక్‌కు అనుకూల నినాదాలు చేసినందుకు గానూ అమూల్యపై దేశద్రోహం కేసు నమోదైంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం నేడు కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఈ కేసులో ఆమెకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

నా కూతుర్ని జైల్లో పెట్టినా తప్పులేదు

అమూల్య వ్యాఖ్యలు టీవీలో, సోషల్‌మీడియాలో వైరల్‌ కాగానే కొందరు స్థానిక మీడియా విలేకరులు ఆమె తండ్రిని సంప్రదించగా ఆయన తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నా కూతురి ప్రవర్తన చూసి దిగ్భ్రాంతికి గురయ్యా. ఇలా మాట్లాడొద్దని చాలా సార్లు చెప్పినా అమూల్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావట్లేదు. ఆమెను జైల్లో పెట్టినా పోలీసులు ఆమె కాళ్లు విరగ్గొట్టినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తన వల్ల నా కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమె కోసం నేను న్యాయపోరాటం కూడా చేయను’ అని యువతి తండ్రి చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.