
అయోధ్య రామాలయ ట్రస్టు సభ్యులు గురువారం ప్రధాని నరేంద్రమోదీని దిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అయోధ్యకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో సమావేశమైన ట్రస్టు సభ్యులు ఆయనను అయోధ్య సందర్శనకు రావాలని కోరారు. ట్రస్టు తొలి సమావేశం జరిగిన తదుపరి రోజునే వీరు ప్రధానితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానిని అయోధ్య సందర్శనకు రావాల్సిందిగా ఆహ్వానించామని చెప్పారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం ప్రభుత్వం 15 మంది సభ్యులతో రామజన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసింది. బుధవారం సీనియర్ న్యాయవాది పరాశరన్ నివాసంలో జరిగిన ట్రస్టు తొలి సమావేశంలో నృత్యగోపాల్‌దాస్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. చంపత్‌రాయ్‌ను ప్రధానకార్యదర్శిగా, గోవిందగిరిని కోశాధికారిగా ఎన్నుకున్నారు. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన నిర్మాణసమితికి ప్రధాని మోదీ మాజీ ముఖ్యకార్యదర్శి నృపేంద్ర మిశ్రా నేతృత్వం వహించనున్నారు.