Programms

గుప్త నిధి కోసం విగ్రహం పెకలింపు

400views

గుప్త నిధుల కోసం దేవుడి విగ్రహాన్ని పెకిలించి తవ్వకాలు సాగించిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం అప్పరాచెరువులో కలకలం సృష్టించింది. గ్రామస్తులు తెలిపిన మేరకు… అప్పరాచెరువు గ్రామానికి అర కిలోమీటరు దూరంలో చెరువు కట్ట కింద ఉన్న అపరాధయ్యస్వామి విగ్రహనికి పూర్వీకుల కాలం నుంచి గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. అపరాధయ్య స్వామి వెలసిన బండ కింద అమూల్యమైన బంగారు నిధి నిక్షేపాలు ఉన్నట్లు స్థానికులు విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు, మూడు సార్లు గుప్తనిధిని వెలికి తీసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామస్తులు ఎవరూ అటువైపుగా వెళ్లలేకపోయారు. దీనిని అదనుగా తీసుకుని గురువారం రాత్రి దుండగులు రెచ్చిపోయారు. ఏకంగా జేసీబీని ఏర్పాటు చేసి అపరాధయ్యస్వామి విగ్రహాన్ని పెకిలించేశారు. అనంతరం విగ్రహం కింద భారీ పరిమాణంలో ఉన్న రాతినీ తొలగించి ఏడు అడుగులకు పైగా లోతున తవ్వారు. తాంత్రిక పూజలు సాగించినట్లుగా అక్కడి ఆనవాళ్ల ద్వారా తెలుస్తోంది. రహదారి వెంబడి మంత్రించిన కొర్రలను చల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా, రెండు, మూడు రోజులుగా కొత్త వ్యక్తులు కారులో సంచరిస్తూ ముందుగా రెక్కీ నిర్వహించినట్లుగా సమాచారం. విషయం తెలిసిన వెంటనే శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులూ అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఎస్‌ఐ సోమశేఖర్‌ మాట్లాడుతూ… గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగినట్లుగా ప్రాథమిక విచారణలో నిర్ధారణ కావడంతో మరింత లోతైన విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.