NewsProgramms

సంఘటితంగా పని చేయడమే సమాజ పరివర్తన

174views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో రెండో రోజు కూడా ‘‘వ్యాఖ్యాన మాల’’ జరిగింది. ఈ సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రసంగిస్తూ సంఘ్ దృష్టికోణాన్ని వివరించారు.

సద్భావన – సకారాత్మక దృష్టి కోణం ఆవశ్యకత

సకారాత్మక దృష్టి కోణం అవసరమే. ప్రతిదీ విన్న తర్వాత కొన్ని సార్లు సమాజం నిరాశ, నిస్పృహల్లోకి వెళ్లిపోతుంది. నిరాశలోకి జారుకుంటుంది. ఈ రెంటినీ పరిశీలిస్తున్న సమయంలో మరో అంశం కూడా కనిపిస్తుంది. మన దేశంలో, సమాజంలో సంప్రదాయంగా కొన్ని తరగతులు వున్నాయి. కొన్ని తరగతులు బయటి నుంచి కూడా వచ్చాయి. ముఖ్యంగా ధార్మిక వర్గాలు. దండయాత్రలు, వలసవాదుల వల్ల వచ్చాయి. కానీ కారణాంతరాల వల్ల వారిని కలుపుకోలేదు. కానీ వారు ఈ సమాజంలోనే భాగమైపోయారు.

హిందూ విచారణ – వసుధైవ కుటుంబకం

వసుధైవ కుటుంబకమే హిందూ భావజాలం. ప్రతి మార్గం కూడా మంచిదే అని భావిస్తుంది. ఇది కేవలం పెదవులపై చెప్పే మాట కాదు. సాధు సంతులు ఈ భావనను ఉపాసన చేస్తున్నారు. ఈ సాధన ద్వారా దీనిని నిరూపించారు. మన సంప్రదాయంలో రామకృష్ణ పరమహంస ఇస్లాం, క్రైస్తవ మతాలను కూడా ఆచరించి చూపారు. అన్ని మార్గాలు కూడా చివరికి ఒకే వైపు దారి తీస్తాయని నిరూపించారు. ఇది మన సమాజంలో వుండే సాధారణ స్వభావం.

అంతరాలను తొలగించడానికి ప్రయత్నాలు

సమాజంలో ఏర్పడిన అంతరాలను తొలగించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రయత్నాలు రెండు వైపులా ప్రయత్నాలు అసవరం. ఒకరి బాధను ఒకరు అర్థం చేసుకోవాలి. నమ్మకం కలగాలి. అపనమ్మకం తొలగిపోవాలి. వైవిధ్యం వున్నప్పటికీ ఒకే దేశం – ఒకే ప్రజ- ఒకే సమాజం మనది. అందరూ ఒకే పూర్వజుల సంతానం. ఒకే సంస్కృతికి వారసులుగా ముందుకు సాగాలి. ఈ భావనే సద్భావన. సకారాత్మకత కోసం ఇది అత్యంత అత్యావశ్యకం.

స్వయంసేవకుల దృష్టి కోణం

స్వయంసేవకుల దృష్టి కోణం కూడా ఇదే దృక్పథంలో వుంటాయి. ఈ దిశగానే ఆలోచిస్తుంటారు. అన్ని రకాలుగా, సావధానంగా ఆలోచిస్తూనే ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటారు. అయితే దీనిని కేవలం సూత్రంతో మాత్రమే చెప్పలేం. దీనికి ఉదాహరణలను కూడా అందించాలి.ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, ఏం మార్చాలి? ఏం మార్చకూడదో ఆలోచించాలి. దేశ స్థాయిలో, స్థానికంగా కూడా ఈ విలువల ఆధారంగా ఓ నమూనాను తీసుకురావాల్సి వుంటుంది.

భారత్ భూమిక – సహకారం

పొరుగు దేశాల్లో శాంతి, స్థిరత్వం, అభివృద్ధి, పర్యావరణ సమతౌల్యత, ప్రజల్లో మంచి విలువలను పెంపొందించే విషయంలో భారత్ పాత్ర వుండాలి. వర్గాలు వేర్వేరు కావొచ్చు. కానీ ఆచారాల విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు. అందర్నీ చేరుకోవాలి. నేటి కాలంలో దీనిని out reach అని పిలుస్తున్నాం. కానీ సంఘ్ చెప్పేది ఏమిటంటే.. ప్రత్యక్ష పరిచయం. వ్యక్తికి వ్యక్తికి మధ్య నేరుగా ప్రత్యక్ష సంభాషణ కావాలి. ఇది ప్రారంభం కావాల్సిన ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారానే సంబంధాలు పరస్పరం బలంగా వుంటాయి. ప్రపంచానికి ప్రయోజనకరం.

సంఘటితంగా పని చేయడం – సమాజ పరివర్తన

దీని ఆధారంగానే మేము ఆలోచిస్తున్నాం. సమాజంలో ఓ సంఘటితమైన వ్యవస్థీకృతమైన కార్యశక్తిని తయారు చేయాలని, దీని ఆధారంగానే సమాజంలో పరివర్తన (మార్పు) తేవాలని భావించాం. సమాజంలో మార్పు అంటే కేవలం వ్యవస్థలో మార్పు కాదు. సమాజ మార్పు అంటే పరివర్తనలో మార్పు. ఓ వ్యవస్థీకృతమైన, సంఘటనాత్మక సమాజాన్ని తయారు చేయడం. ఈ ప్రాతిపదికనే వ్యవస్థ మారుతుంది. దానంతట అదే ఏ వ్యవస్థా మారదు. గుణాత్మకంగా వున్నప్పుడు, సంఘటితంగా వున్నప్పుడు, స్పష్టమైన దృష్టికోణం వున్నప్పుడు, ఆచరణ కూడా వీటన్నింటికి అనుగుణంగా వున్నప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. అందుకే మార్పుకు ఆచరణతోనే నాందీ ప్రస్తావన జరగాలి. అయితే పరివర్తన కోసం మేము కొంత పనిని ప్రారంభించాం. ఈ పని స్వయంసేవకుల్లో, వారి ఇళ్లల్లో కూడా జరగాలి. దీనిని ఆధారంగా చేసుకొనే, పరిశీలించే సమాజం కూడా ముందుకు వస్తుంది. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది.దీనినే మేము ‘‘పంచపరివర్తన్’’ అని పిలుస్తాం. ఇవి చాలా సులభమైన పనులు. దీనికంటే ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదు. కానీ చేయాలన్న తపన వుంటే చాలు. దీనికో నమూనా కావాలి. సంఘ స్వయంసేవకే నమూనా.

స్వయంసేవకుల పాత్ర

స్వయంసేవక్ గా వెంటనే నూటికి నూరు పాళ్లూ అవ్వలేరు. పూర్తిగా స్వయంసేవక్ గా తయారవడానికి కాస్త సమయం పడుతుంది .అప్పటి వరకు ఆగాలి. ఎదుకంటే ఈ సమయంలో తక్షణ అవసరం వుంది. అందుకే స్వయంసేవకులు ఐదు అడుగులు ముందుకు వేసి, సమాజాన్ని తమతో తీసుకెళ్లాలి.దీంతో ఓ లాభం కూడా వుంది. ఎందుకంటే స్వయంసేవకులు వెంటనే పది వేల అడుగులు ముందుకు వేసి, సమాజాన్ని పిలిస్తే.. అంత నడవడం తమతో కాదని సమాజం చేతులెత్తేస్తుంది. అదే ఐదు అడుగులు అంటే.. సమాజం వారితో సులభంగా కలిసొస్తుంది.

పంచపరివర్తన్

1. కుటుంబ ప్రబోధన్ : సంస్కృతి లేకపోవడం, సంబంధాలలో దూరం పెరుగుతోంది. కొత్త తరంలో వ్యక్తిగతంగా చూసుకోవడం పెరిగిపోతోంది. ఎవరిది వారే చూసుకుంటున్నారు. దీనికి అతిపెద్ద కారణం మొబైల్. పిల్లవాడు ఏం చేస్తున్నాడో, చూస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. ప్రతిదాన్ని గోప్యంగా వుంచుతాడు. దీంతో దుష్పరిణామాలు అంతటా కనిపిస్తున్నాయి.

దీన్ని సరిదిద్దడానికి, చిన్నతనం నుండే కుటుంబంలో విలువలను పెంపొందించడం అవసరం. కుటుంబ సభ్యులందరూ వారానికి ఒకసారి ఒక నిర్ణీత సమయంలో కలిసి కూర్చోవాలి.భజనలు చేయాలి. ఇంట్లో వండిన ఆహారాన్ని భుజించాలి. ఆపై రెండు మూడు గంటలు కలిసి మాట్లాడుకోవాలి. ఈ చర్చలో మన కుటుంబం, కుటుంబ నేపథ్యం, పూర్వజులు, సంస్కృతి, సంప్రదాయాలు, ఏది క్షేమం? క్షేమం కానిది ఏది? సంప్రదాయంగా వస్తున్న వాటిల్లో ఇప్పుడు కూడా ఆచరించాల్సినవి ఏవి? ఇలాంటి వన్నీ మాట్లాడుకొని, ఆచరణలోకి తీసుకురావాలి. ఈ చర్చలో చిన్న పిల్లలుంటారు. వారికి అర్థమయ్యేలా కూడా చెప్పాలి.
అయితే ఈ చర్చల్లో కేవలం మన ఇంటి గురించే కాకుండా దేశం, ధర్మం గురించి కూడా చెప్పాలి. పరిచయం చేయాలి. మన పూర్వీకుల ఆదర్శాలు, చరిత్ర, సంప్రదాయం, మంచి కథలు కూడా చెప్పాలి. వీటి ద్వారా మనం ఏమి అమలు చేయవచ్చో కూడా చర్చించాలి.

మనం సంపాదిస్తాం. దీనిని కుటుంబం కోసం ఖర్చు చేస్తాం. అయితే ప్రతి రోజూ దేశం కోసం, సమాజం కోసం ఏం చేస్తున్నామో, చేయాలో కూడా పిల్లలకు చెప్పాలి. చిన్న పిల్లలు చేయగలిగే పనులను వారితో చేయించాలి. కుటుంబమంతా కలిసి కూర్చుని సమాజానికి ఎవరు ఎంత సమయం కేటాయిస్తారు, ఏ పని చేస్తారు అనే దాని గురించి చర్చించుకోవాలి.

ఉదాహరణకు తీసుకుంటే…

తొమ్మిదో తరగతి చదివే వారు తమ బస్తీలోని ఇతర పిల్లలకు పాఠాలు చెప్పవచ్చు.

తన ఇంట్లోనే ఓ మొక్కను నాటవచ్చు. దీనిని జాగ్రత్తగా చూసుకోవచ్చు.

పిల్లలకు కేవలం చెబితే వినరు. అనుభవాలు, ఆచరణ ద్వారా వారికి నేర్పించాలి. యాత్రలంటూ సింగపూర్, పారిస్ తీసుకెళ్లకుండా కుంభల్ గఢ్ కోట, కార్గిల్ ప్రదేశం, లేదంటే స్థానికంగా వుండే మురికివాడలు, అక్కడ నివసిస్తున్న ప్రజలను చూపించండి. ఈ ప్రభావాలు ప్రజల మనసుల్లో లోతైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ చిన్న చిన్న పనుల వల్లే సంబంధాలు తెలిసొస్తాయి. సంస్కారాలు చెప్పడం ద్వారా మాత్రమే అబ్బవు. అనుభవం ద్వారా కూడా అబ్బుతాయి. పంచపరివర్తన్ సమాజ ప్రవర్తనలో సానుకూల మార్పును తెస్తుంది.
12 సంవత్సరాల వయస్సులోపు పిల్లల జీవితంలో శాశ్వత మానసిక స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిని సరైన దిశలో నడిపించడమే కుటుంబ ప్రబోధన్ లక్ష్యం.

పర్యావరణం గురించి…

ఈ విషయం అందరికీ తెలుసు. ప్రజలు వెంటనే దీనిని అనుసరిస్తారు కూడా. విధాన పరమైన మార్పులు చాలా పెద్దవి. అలా మారడానికి సమయం పడుతుంది. సమాజం చాలా ముందుకు వెళ్లింది. అకస్మాత్తుగా మారడం అంటే, మలుపు తిరగడం అంటే బోల్తా పడుతుంది.అందుకే మార్పులు క్రమ క్రమంగా చేయాల్సి వుంటుంది. కానీ చిన్న చిన్న పనులను మాత్రం వెనువెంటనే చేయాలి.
నీటిని ఒడిసిపట్టడం, సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించడం, పచ్చదనం కోసం చెట్ల పెంపకం
ప్రజలు దీన్ని ఉత్సాహంగా చేస్తారు. ఇది పర్యావరణాన్ని మెరుగుపరచడమే కాకుండా మానవత్వాన్ని కూడా పెంచుతుంది.

సామాజిక సమరసత

ఇది కాస్త కష్టమైన పని. కానీ చేయాల్సిందే. సమానత్వం అని మాట్లాడటం సులభం. కానీ అసమానత ఎక్కడ వుందో చూడటం కష్టం. ఏ వ్యవస్థలోనూ ఇది లేదు. మనిషి మనస్సులో అసమానత వుంది. ఒక వ్యక్తిని చూసినప్పుడు లేదా అతని పేరు విన్నప్పుడు, అతను ఏ కులానికి చెందినవాడో అని ఎవరైనా వెంటనే ఆలోచిస్తే – అది తప్పు. మనిషిని మనిషిగా చూడాలి కులం కోణంలో చూడటం అసమానతకు మూల కారణం. ప్రవర్తనను మార్చుకోవడం ద్వారా ఇది మనస్సు నుంచి వెళ్లిపోతుంది. సమాజం మొత్తాన్ని ఒక్కటిగానే పరిగణించాలి.
దీని కోసం

1. మన స్నేహితులంటే అన్ని కులాలకు సంబంధించిన వారూ వుండాలి.

2. కుటుంబ పరంగా కూడా సంబంధాలుండాలి.

3. వారి ఇళ్లకు వెళ్లి వస్తూ వుండాలి.

4. పర్వదినాలు, పండగలతో పాటు కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాలి.

ఇలా చేయడం ద్వారా అంతరాలు తగ్గుతాయి. కొన్ని సంవత్సరాల్లోనే ఇది సాధ్యపడుతుంది. అలాగే, సమాజంలోని దేవాలయాలు, శ్మశానవాటికలు, నీటి వనరులు వంటి ప్రజా స్థలాలు అందరికీ సమానంగా తెరిచి ఉండాలి. అక్కడ ఎలాంటి వివక్షత ఉండకూడదు.ఆలయం భక్తుల కోసమే, భక్తుడి కులం అడగరు. నీరు అందరికీ ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా వివక్ష ఎందుకు ఉండాలి?

స్వావలంబన :

మనం అభివృద్ధి చెందాలంటే ప్రతి అంశంలోనూ స్వావలంబన సాధించాలి. మన ఇంటి నుంచే ప్రారంభించాలి. స్వదేశీ అంటే విదేశీ ఉత్పత్తులను పూర్తిగా నిలిపేయడం అని కాదు. అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగుతుంది కానీ.. ఒత్తిడితో కాదు. పూర్తి స్వచ్ఛందంగా.

ఉదాహరణకు…

1. వేసవిలో నిమ్మకాయలతో మనం షరబత్ చేసుకోవచ్చు. కోకో కోలా, ఎందుకు తెచ్చుకోవాలి?

2. పౌష్టికాహారం ఇంట్లోనే వండుకోవచ్చు. కానీ పదే పదే పిజ్జా, బర్గర్ ఎందుకు?

3. మన గ్రామంలోనే ఏ వస్తువైనా తయారయితే.. ఆ వస్తువును బయటి నుంచి ఎందుకు తెచ్చుకోవడం? స్థానికంగా తయారైన వస్తువులను కొనుగోలు చేస్తే, అక్కడ ఉద్యోగ అవకాశాలు దొరకుతాయి.

4. మన దేశంలోనే కార్లు తయారైతే.. వాటినే కొనుగోలు చేయాలి.

స్వదేశీ సారాంశం ఏమిటంటే.. మన దేశంలో ఏవైతే తయారవుతాయో మాటిని మాత్రమే కొనుగోలు చేయడం. మన దేశంలో తయారు కాని వాటిని విదేశాల నుంచి కొనుగోలు చేయవచ్చు.

స్వీయ అవగాహన – క్రమశిక్షణ :

మన ఇంట్లో మన భాష, మన వస్త్ర ధారణ, మన ఆహారం, మన సంప్రదాయాలు వుండాలి. మన మాతృభాషనే మాట్లాడాలి. మన వస్త్ర ధారణ వుండాలి. ఇంట్లో పూజా మందిరం వుండాలి. స్వ బోధ అంటే.. మన సంప్రదాయాలు, ఆచారాలను పాటించడమే.

రాజ్యాంగాన్ని, చట్టాలను అనుసరించాలి. చట్టాలను చేతుల్లోకి తీసుకోకూడదు. నిరసన తెలియజేయాలనుకుంటే చట్టప్రకారం చేయాలి. శాంతియుతంగా చేయాలి.
బిల్లులు సకాలంలో చెల్లించాలి. 2. లైసెన్స్ సమయం ప్రకారం రెన్యువల్ చేసుకోవాలి. చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనదు.

ఇదే దేశభక్తి అంటే. దేశం కోసం జీవించడమే నిజమైన దేశ భక్తి. మన పూర్వజులు దేశం కోసం ప్రాణాలర్పించేవారు. ఈ కాలంలో 24గంటలూ దేశం కోసమే జీవించాలి.