
దేశంలో జనాభా అసమతుల్యత (డెమోగ్రాఫికల్ చేంజ్), యువతను నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాలు వంటి అంశాల పై చర్చించబోతున్నామని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ చెప్పారు. విశాఖపట్నం వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారత సమన్వయ బైఠక్ విశాఖపట్నం సమీపంలో గల గుడిలోవ విజ్ఞాన విహార పాఠశాలలో జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం ఆయన విజ్ఞాన విహార పాఠశాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ‘అఖిల భారత సమన్వయ బైఠక్’ మూడు రోజుల పాటు జరగనుందని,ఆగస్టు 19వ తేదీ ఉదయం 9:00 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 21వ తేదీ సాయంత్రం వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు. ఈ బైఠక్ లో సంఘ ప్రేరణతో పనిచేస్తున్న మొత్తం 32 సంస్థలకు చెందిన ప్రధాన బాధ్యులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశాలలో ప్రతినిధులుగా ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే, సహ సర్ కార్యవాహలు, ఇతర కేంద్ర బాధ్యులు పాల్గొంటున్నారని చెప్పారు.
వివిధ రంగాల ప్రముఖులు హాజరు
సంఘ ప్రేరిత సంస్థలైన భారతీయ మజ్దూర్ సంఘ్ , విశ్వహిందూ పరిషత్ , భారతీయ జనతా పార్టీ , అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ , భారతీయ కిసాన్ సంఘ్, రాష్ట్ర సేవికా సమితి తదితర సంస్థల జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంఘటనా కార్యదర్శులు హాజరవుతారని చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ సంస్థల నుంచి 49 మంది మహిళలతో కలిపి మొత్తం 253 మంది ప్రముఖులు, సంఘ ప్రముఖులతో కలిపి మొత్తం సుమారు 327 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని అన్నారు.
చర్చనీయాంశాలు
ఈ బైఠక్ నిర్ణయాత్మక (ఎగ్జిక్యూటివ్) సమావేశం కాదని, సమాజ హితం కోసం వివిధ సంస్థల మధ్య పరస్పర అనుభవాలను పంచుకుంటూ సమన్వయాన్ని పెంపొందించుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు, సామాజిక మార్పులు సమస్యల పరిష్కారాలపై సమీక్ష జరుగుతుందని చెప్పారు.

జనాభా అసమతుల్యత (డెమోగ్రాఫిక్ మార్పులు)
దేశంలో మారుతున్న జనాభా తీరుతెన్నులు, వాటి పరిణామాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించ నున్నామని స్పష్టం చేశారు. యువతను మాదకద్రవ్యాల నుంచి దూరం చేయటం (నశా ముక్తి) పై కార్యాచరణ రూపొందించాల్సి ఉందని అన్నారు. యువతలో పెరుగుతున్న దుర్వ్యసనాలపై ఆందోళన వ్యక్తం చేశారు. వాటి నివారణకు తీసుకోవాల్సిన కార్యాచరణ, యువతలో చైతన్యం తీసుకురావడం అవసరమని అన్నారు.
సంఘ శతాబ్ది సంవత్సరం – పంచ పరివర్తన్
సామాజిక సామరస్యం, పర్యావరణ అనుకూల జీవనశైలి,కుటుంబ ప్రబోధనం (కుటుంబ విలువలు), ‘స్వ’ భావన (స్వదేశీ/స్వ జాగృతి), పౌర కర్తవ్యాల పాలన అంశాలను సంఘ్ స్వీకరించిందని వాటిపై చర్చిస్తామని చెప్పారు.
భారతీయ అభివృద్ధి నమూనా
ఆర్థిక అంశాలతో పాటు అన్ని రంగాలను సమతుల్యం చేసే సమగ్ర అభివృద్ధి నమూనాపై ఆలోచన చేస్తున్నామని దానిపై విస్తృతంగా చర్చిస్తామని అన్నారు. అభివృద్ధి కేవలం ఆర్థిక అంశాలకే పరిమితం కారాదని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని చెప్పారు.
యువతలో పెరుగుతున్న ఆదరణ
సంఘ శతాబ్ది వేళ సమాజంలో ఆర్‌ఎస్‌ఎస్ పట్ల విశేష ఆదరణ పెరుగుతోందని, ‘జాయిన్ ఆర్‌ఎస్‌ఎస్’ వెబ్‌సైట్ ద్వారా 2025 జనవరి-జూలై మధ్య 9,718 మంది నమోదు చేసుకోగా, 2026లో అదే కాలానికి దాదాపు రెండున్నర రెట్లు పెరిగి 24,086 మంది చేరడానికి ఆసక్తి చూపారని చెప్పారు . వీరిలో 30 ఏళ్లలోపు యువత 65% కంటే ఎక్కువ కాగా, 40 ఏళ్లలోపు వారు దాదాపు 85% ఉన్నారని తెలిపారు
విలేకరుల సమావేశంలో దక్షిణ మధ్య క్షేత్ర సహ సంఘచాలక్ దూసి రామకృష్ణ, సహ ప్రచార ప్రముఖ్ ప్రదీప్ జోషి, ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ్ బయ్యా వాసు, సహ ప్రచార ప్రముఖ్ వాసుదేవ రావు పాల్గొన్నారు.





