News

నేతాజీ అస్థికలు భారత్‌కు వస్తాయా? సుప్రీంకోర్టులో కీలక పరిణామం

3views

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను జపాన్ నుంచి భారత్‌కు తీసుకురావాలన్న అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచినట్లు చెబుతున్న నేతాజీ అస్థికలను స్వదేశానికి తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ ఫాఫ్ చాలాకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాజాగా ఈ అంశం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది.

నేతాజీ మునిమనవడు, రచయిత ఆశిష్ రే దాఖలు చేసిన పిటిషన్‌పై మార్చి 12న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ అత్యంత సున్నితమైన అంశంలో నేతాజీ కుటుంబంలోనే ఆయన మరణం, రెంకోజీ ఆలయంలో ఉన్న అవశేషాల ప్రామాణికతపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. అందువల్ల ప్రత్యక్ష వారసురాలైన అనితా బోస్ ఫాఫ్ స్వయంగా కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా అనితా బోస్ ఫాఫ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉన్నప్పటికీ, ఆమె తరఫున స్వయంగా పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆమె తన తండ్రి అస్థికలను భారత్‌కు తీసుకురావాలనుకుంటే, ఆ అభ్యర్థనను తానే న్యాయస్థానం ముందు ఉంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఆశిష్ రే పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు కోర్టు అనుమతించింది.

1945 నుంచి కొనసాగుతున్న వివాదం
1945 ఆగస్టులో తైహోకు (ప్రస్తుత తైపీ)లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారనే అభిప్రాయానికి పలు విచారణలు, సాక్ష్యాలు మద్దతు ఇచ్చాయి. అయితే ఆయన మరణం, రెంకోజీ ఆలయంలో భద్రపరిచిన అవశేషాలు నిజంగా నేతాజీవేనా అన్న అంశంపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. అనితా బోస్ ఫాఫ్ మాత్రం తన తండ్రి విమాన ప్రమాదంలో మరణించారని నమ్ముతూ, ఆయన అవశేషాలను భారత్‌కు తీసుకువచ్చి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలని కోరుతున్నారు.

ఇక అనితా బోస్ ఫాఫ్ తదుపరి అడుగు కీలకం
ప్రస్తుతం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి అస్థికలను భారత్‌కు తీసుకురావాలని ఆదేశించిన పరిస్థితి లేదు. అనితా బోస్ ఫాఫ్ స్వయంగా పిటిషన్ దాఖలు చేస్తే ఈ అంశాన్ని న్యాయస్థానం పరిశీలించే అవకాశం ఉంది. దీంతో ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగుతున్న నేతాజీ అస్థికల స్వదేశ ప్రవేశం అంశంలో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.