News

మెరిట్ ఆధారంగానే అర్చకులు, వేద పండితుల నియామకాలు

17views

రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, ఇతర ధార్మిక సిబ్బంది నియామకాల్లో ప్రస్తుతం జోనల్ విధానం అమల్లో లేదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాంతీయ ప్రాతిపదికన కాకుండా వేద, ఆగమ పరిజ్ఞానం, అర్హత, ప్రతిభ, మెరిట్ ఆధారంగానే నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు.

మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారథి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ప్రధాన దేవాలయాల్లో రాయలసీమ ప్రాంతానికి చెందిన అర్చకులు, వేద పండితులకు అన్యాయం జరుగుతోందా? స్థానికులకు ప్రాధాన్యత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఇటీవల విడుదల చేసిన నియామక నోటిఫికేషన్‌ను రాయలసీమ జోన్‌ను పరిగణనలోకి తీసుకుని సమీక్షించే ప్రతిపాదన ఏమైనా ఉందా? అనే అంశాలపై ఎమ్మెల్యే ప్రశ్నించారు.

ప్రధాన దేవాలయాల్లో అర్చకులు, వేద పండితుల నియామకాల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదని మంత్రి తెలిపారు. ఇటీవల భర్తీ చేసిన 344 పోస్టుల్లో 172 పోస్టులను రాయలసీమ ప్రాంతంలోని ప్రధాన దేవాలయాల్లో భర్తీ చేసినట్లు వెల్లడించారు.

ప్రధాన దేవాలయాల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసి, అర్హులైన వేద, ఆగమ పండితులను పూర్తి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తున్నామని చెప్పారు. ప్రాంతం కంటే వేద, ఆగమ పరిజ్ఞానానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన నియామకాల్లో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు చెందిన వేద, ఆగమ పండితులను ఎంపిక కమిటీల్లో సభ్యులుగా నియమించి, వారి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.

సుమారు 1,400 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా, వారిలో కేవలం 15 మందిని మాత్రమే ఎంపిక చేయాల్సి వచ్చిందని, దీంతో పోటీ తీవ్రంగా ఉందన్నారు. ఒకటి, రెండు మార్కుల తేడాతో కూడా అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు వివరించారు.

మొత్తం నియామక ప్రక్రియను వీడియో రికార్డింగ్‌తో అత్యంత పారదర్శకంగా నిర్వహించామని మంత్రి తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులకు సైతం రికార్డింగ్ చూపించేలా పారదర్శకత పాటించామని చెప్పారు. నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

రాయలసీమ ప్రాంతం నుంచి మొత్తం 1,431 దరఖాస్తులు వచ్చాయని, అర్హత సాధించిన అభ్యర్థుల్లో 172 మందికి అవకాశం లభించిందని మంత్రి వెల్లడించారు. వేదం, సంస్కృతం, ఆగమ పరిజ్ఞానం తదితర అంశాల ఆధారంగానే ఎంపికలు జరిగాయని తెలిపారు.

కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలకు సంబంధించిన నియామకాల్లోనూ అర్హత, వేద పరిజ్ఞానం, మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

జోన్-4లో 147 ఖాళీలు

రాయలసీమలోని జోన్-4 పరిధిలో ప్రధాన దేవాలయాల్లో మొత్తం 440 పోస్టులు ఉండగా, ప్రస్తుతం 245 మంది పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. ఇంకా 147 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని కూడా నిబంధనల ప్రకారం త్వరలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.

ప్రధాన దేవాలయాల్లో భక్తులకు శాస్త్రోక్తంగా, ఆగమబద్ధంగా సేవలు అందించేందుకు నైపుణ్యం కలిగిన అర్చకులు, వేద పండితులు, ఆగమ పండితులు అవసరమని మంత్రి పేర్కొన్నారు. అందువల్ల ప్రాంతీయ ప్రాతిపదికన కాకుండా వేదం, ఆగమం, అర్హత, ప్రతిభ, మెరిట్‌కు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా నియామకాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.