NewsProgramms

సంఘ శాఖ అతిగొప్ప శాస్త్రీయ మనో వైజ్ఞానిక ప్రక్రియ

125views

నంద్యాల, క్రాంతి నగర్ బస్తీలో హిందూ సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ శింగసాని హృషీ కేష్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన సభలో వేదాంత గీతా శివం ఫౌండేషన్ చాగలమర్రి, అధ్యక్షులు పూజ్య శ్రీ ఆచార్య అభినవ శంకరానంద స్వామీజీ ముఖ్య అతిథిగా , రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ మాన్య శ్రీ భరత్ కుమార్ ప్రధాన వక్తగా పాల్గొన్నారు.

భారతమాత పూజ, మాలార్పణ తదుపరి స్వామిజీ అనుగ్రహ భాషణం చేస్తూ సనాతన ధర్మ వైభవాన్ని వివరించారు. సనాతన ధర్మం ప్రపంచానికి ఎన్నో శాస్త్రాలను అందించిందని. కరోనా సమయంలో విధర్మీయ దేశాలు వాక్సిన్ అమ్మి సొమ్ము చేసుకోవాలని చూస్తే, సర్వేజనా సుఖినోభవంతు అంటు 80 పేద దేశాలకు, మతాలకు అతీతంగా ఉచితంగా వాక్సిన్ అందించి వారి ప్రాణాలు కాపాడిందని తెలియ జేశారు. మన దేవతలు, స్వామీజీలు అంటరాని తనం పాటించలేదని ఉదాహరణలతో వివరించారు. ఉడిపి శ్రీ కృష్ణుని అభిషేకాన్ని అంటరాని వాడు చూడకూడదని బయటికి పంపితే ఆభక్తుని కోసం భగవంతుడే వెనక్కు తిరిగాడని, నేటికి మనము ఆ కిటికీ నుండే స్వామిని చూస్తున్నామని తెలిపారు. హైందవ ధర్మ రక్షణకు శ్రీశైలం లోని భవానీ మాత ప్రసాదించిన శివాజీ మహారాజ్ చేతిలోని ఖడ్గం గా మన మారాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఒక్కరు మూడు పీ లను పాటించాలన్నారు. ప్రొటెక్ట్ (కాపాడు) పర్ఫెక్ట్ (సనాతన ధర్మ జ్ణానాన్ని పరిపూర్ణంగా సంపాదించు) ప్రొమోట్ (సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయుము).

ప్రధాన వక్త మాట్లాడుతూ, ఈ భూమిని దేవతలు కాపాడుతున్నారని రాజస్థాన్ లో 140 బాంబులు వేసినా పేలని తనోటుమాత దేవాలయపు ఉదంతాన్ని వివరించారు‌. విత్తనం ఎలాగైతే మట్టిలోని సారాన్ని, నీటిలోని గుణాన్ని, సూర్యుని శక్తిని తీసుకుని తన స్వీయ గుణాన్ని కోల్పోకుండా ఎదుగుతుందో అలాగే హిందూత్వం ప్రపంచంలోని ఉత్తమ గుణాలను అందిపుచ్చుకొని ఎదుగు తున్నదని తెలియ జేశారు. బావిలో కప్పల్లాంటి ఎడారి, సముద్రపు మతాలకు అనంతమైన సనాతనధర్మం విస్తృతి తెలియదని తెలిపారు. సంఘ శాఖ అతి సాధారణంగా కనిపించే అతిగొప్ప శాస్త్రీయ మనో వైజ్ఞానిక ప్రక్రియ అని తెలియ జేశారు. ఇందులో దేశభక్తులు తయారవుతారని తెలియజేశారు.

సామాజిక సమరసత మన పురాణాలలో పరిమళించిందని తెలిపారు. రాముడు-గుహుడు, రాముడు-శబరి, కృష్ణుడు- కుచేలుడు లాంటి ఉదాహరణలతో సమరసత చాటారని తెలిపారు.

రాముడి వెంట అడవులకు నడిచిన సీత పత్నీ ధర్మాన్ని చాటితే, అన్న వెంట నడిచిన లక్ష్మణుడు, పాదుకలను సింహాసనం పై ఉంచి రాముని ప్రతినిధిగా పాలించిన భరతుడు సోదర ధర్మాన్ని చాటారని తెలిపారు. రామాయణం అద్భుత మైన కుటుంబ వ్యవస్థకు నిదర్శనంగా చెప్ప బడు తుందని తెలిపారు. ప్రతి మదిలో శ్రీరాముడి సన్మార్గం ప్రతిష్టింప బడాలని పిలుపు నిచ్చారు‌. మనం నిరంతరం పర్యావరణ హితంగా, పర్యావరణాన్ని మితంగా వాడుకుంటూ, సకల జీవరాసులకు హితంగా బ్రతకాలన్నారు, శ్రీరాముడు అరణ్యవాసం సమయంలో చిన్న పర్ణశాలలో, కందమూలాలు భుజిస్తూ పర్యావరణ హితంగా జీవించాడని తెలిపారు.

భూ కాలుష్యాన్ని నివారిస్తూ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ, నీటి వృధాను, ఇంధన పొదుపును పాటిస్తూ, పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఒక్కో మొక్కను నాటి సంరక్షించి మన భూమాత సేవ చేయాలన్నారు. స్వదేశీ వస్తువులు, స్వదేశీ ఆచారాలను మాత్రమే వినియోగిస్తూ భారత్ స్వావలంబన కు బాటలు వేయాలని తెలిపారు. మనం అందరం ఉత్తమ పౌరులుగా మన మన విద్యుక్త ధర్మాలను పాటిస్తూ సుసంఘటిత, బాధ్యతాయుతమైన, శోషణ లేని జాగృత, వికసిత భారత్ గా ఎదగాలని, మనం అందరం సంఘటితంగా ఉంటే మన అక్కచెల్లెళ్ళు, మాతృమూర్తులకు అన్యాయం, అపచారం జరగదని , కళ్ళు మూస్తే దైవం, కళ్ళు తెరిస్తే దేశం కనపడాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో 2137 మంది తరుణ, 1959 మంది మహిళలు, 422 బాలతో కలిపి మొత్తం 4518 పాల్గొన్నారు. అలాగే 8 ఉపబస్తీలు, 8 పంచాయతీలు పాల్గొన్నాయి.

కార్యక్రమం ఆద్యంతం చిన్నారుల కోలాటం, సాంస్కృతిక నృత్యాలతో కోలాహలంగా సాగింది. సభా ప్రాంగణం మాత్రమే కాకుండా క్రాంతి నగర్ మొత్తం కాషాయ మయంగా మారింది. ఆహుతులు కార్యకర్తల ప్రణాళిక బద్ద కృషిని అభినందించారు‌.

శాంతి పాఠం, భోజన మంత్రం తదుపరి భోజనంతో కార్యక్రమం సంపన్నమైంది.