
న్యూఢిల్లీ: ఐఎస్ఐ మద్దతు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షహజాద్ భట్టీ నెట్‌వర్క్‌పై దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు భద్రతా బలగాలు 14 రాష్ట్రాల్లో సమన్వయంతో చేపట్టిన చర్యల్లో 200 మందికిపైగా నెట్‌వర్క్ ఆపరేటివ్‌లను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ చర్యలతో ఉగ్రవాద నెట్‌వర్క్ విధ్వంసకర దాడుల ప్రణాళికలను భగ్నం చేసినట్లు పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా అమిత్ షా స్పందిస్తూ.. ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్’ విధానానికి ఈ ఆపరేషన్ నిదర్శనమని పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లో నిర్వహించిన సమన్వయ దాడుల్లో 200 మందికిపైగా అరెస్టయ్యారని తెలిపారు. తాజా వివరాల ప్రకారం 253 మందిని అదుపులోకి తీసుకుని, 80కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
భద్రతా బలగాలు నిర్వహించిన సోదాల్లో ఐఈడీలు, పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు ఉన్నట్లు చెబుతున్న గ్రెనేడ్లు, పిస్టళ్లు, లైవ్ తూటాలు, గూఢచర్యానికి ఉపయోగించినట్లు అనుమానిస్తున్న సీసీటీవీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నట్లు అమిత్ షా తెలిపారు.
షహజాద్ భట్టీ నెట్‌వర్క్ పలు ఉగ్ర కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ సమన్వయ ఆపరేషన్ ద్వారా నెట్‌వర్క్ కార్యకలాపాలను అడ్డుకున్నట్లు కేంద్రం పేర్కొంది.
గతంలోనూ మహారాష్ట్రలో ఆపరేషన్
ఇదిలా ఉండగా, షహజాద్ భట్టీ నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయనే అనుమానాలపై మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) గతంలో రాష్ట్రవ్యాప్తంగా చర్యలు చేపట్టింది. భట్టీ సోషల్ మీడియా వేదికల ద్వారా యువతను ప్రభావితం చేసి, దేశ వ్యతిరేక కార్యకలాపాల వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానించిన విషయం తెలిసిందే.
తాజా దేశవ్యాప్త ఆపరేషన్‌తో షహజాద్ భట్టీ నెట్‌వర్క్‌పై భద్రతా సంస్థలు మరింత కఠిన చర్యలు చేపట్టినట్లయింది.





