
హోమియోపతికి మరింత ప్రజాదరణను పెంపొందించడంలో శాస్త్రీయ పరిశోధన, నైపుణ్యం ముఖ్యపాత్ర పోషిస్తాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా.. ఇక్కడ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రెండురోజుల సదస్సును రాష్ట్రపతి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ… ‘చాలా దేశాల్లో హోమియోపతిని అందుబాటులో ఉండే చికిత్సా పద్ధతిగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు హోమియోపతిని ప్రోత్సహిస్తున్నాయి. ఆయుష్ మంత్రిత్వశాఖ, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి సంస్థలు హోమియోపతిని ప్రజలకు చేరువ చేయడానికి కృషి చేస్తున్నాయి. ఇతర చికిత్సా పద్ధతులను ప్రయత్నించిన తర్వాత హోమియోపతి విధానాన్ని ఆశ్రయించి దాన్నుంచి ప్రయోజనం పొందినట్లు చాలా మంది తమ అనుభవాలను పంచుకుంటారు. అయితే ఆ విషయాలను శాస్త్రీయ సమాజం గుర్తించాలంటే వాస్తవాలు, విశ్లేషణలను సమర్పించాల్సిన అవసరం ఉంది. అందుకు పరిశోధనలు విస్తృతం చేయాలి’ అని ముర్ము పేర్కొన్నారు.





