ArticlesNews

ఆహారమే జీవితానికి దిక్సూచి

72views

ప్రతి మెతుకూ బ్రహ్మస్వరూపంగా భావించగలిగితే, తినే తీరులో గౌరవం, శాంతి, ఆరోగ్యభద్రత – ఇవన్నీ కలుగుతాయి. శరీరంలో ఆమ్లత తగ్గుతుంది. అరిగే ప్రక్రియ తేలికవుతుంది. తినే పరిమాణం సజీవంగా నియంత్రిత మవుతుంది. మానసిక ఉద్వేగాలు పొట్టపై ప్రభావం చూపకుండా ఉంటాయి. తినే ఆహారం నమ్మకంగా ఉంటే మనసు నిజంగా మనవైపే ఉంటుంది.

‘‘హృదయం చేతనాధిష్ఠానం’’ అంటుంది ఆయుర్వేదం. ఆహారమే ఈ చైతన్య ప్రవాహానికి దిశానిర్దేశం చేస్తుంది. ఆహారం శుద్ధిగా ఉంటే మనసు శుద్ధిగా ఉంటుంది. మన భోజన విధానం ఓ తపస్సులాంటిది. మౌనం, కృతజ్ఞత, ధ్యానం ఇవన్నీ పవిత్ర పోషకాలు!

‘‘యథా అన్నం తథా మనః’’- ‘నువ్వు తినేదే నువ్వు అవుతావు’ అనేది సూత్రం. ఆహారం ద్వారానే ఆత్మాభివృద్ధి, మానసిక ఉన్నతి సిద్ధిస్తాయి. మన ఆహారమే మన ఆరోగ్యాన్ని, మనస్తత్వాన్ని, జీవన ధోరణిని నిర్ణయిస్తుంది.

ఆహారం ఒక మౌనయోగం. మనసు స్థిరంగా ఉంటే, ఆహారం సమగ్రంగా అరిగి, శక్తిగా మారు తుంది. ఆగ్రహం, దిగులు, తొందర`వీటికి లోను కాకుండా ప్రశాంతంగా తింటే శరీరం సులభంగా జీర్ణం చేయగలుగుతుంది. తినే పరిమాణాన్ని మనమే నియంత్రించ గలుగుతాం. ఎలాంటిది తింటున్నామో, ఏ పరిస్థితుల్లో తింటున్నామో, మన మనసూ అలాగే ఉంటుంది. అన్నాన్ని గౌరవించి శాంతి భావనతో భుజించాలి! ‘‘భోజన కాలే గోవిందనామ స్మరణ’’ అందుకే!

ఆయుర్వేదం ఆహార మనస్తత్వ శాస్త్రం!

ఆయు స్సత్త్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః

రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్విక పియాః

కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః

ఆహారా రాజస స్యేష్టా దుఃఖశోకామయ ప్రదాః

యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్‌

ఉచ్చిష్టమపి చామేథ్యం భోజనం తామసప్రియమ్‌

భగవద్గీత ‘‘శ్రద్ధాత్రయవిభాగ యోగం’’లో వ్యాసులవారి వివరణ ఇది! మనం తినే తిండిని బట్టి మన మనస్తత్వం, నడవడి, మన ఆరోగ్యం ఎలాంటివో చెప్పవచ్చునంటారీ శ్లోకాల్లో! కొందరు కొన్నింటినే ఇష్టపడతారు. ఈ ఇష్టానిష్టాలకు కారణం వారివారి మనస్తత్వాలే!

‘కాశ్యప సంహిత’ అనే ఆయుర్వేద గ్రంథం ‘‘సత్త్వం ప్రకాశకం విద్ధి, రజశ్చాపి ప్రవర్తకమ్‌ తమో నియామకం ప్రోక్త మన్యోన్య మిధున ప్రియమ్‌’’ అని పేర్కొంది. సత్త్వగుణం- ప్రకాశకం. రజోగుణం- ప్రవర్తకం, తమోగుణం- నియామకం అనే ధర్మాలతో ఈ మూడూ పరస్పరం కలిసి మనిషి మనసుని ఏర్పరుస్తున్నాయని, ఈ మనసు సాత్త్వికం, రాజసం, తామసం అని మూడు రకాలుగా ఉంటుందని దీని భావం!

మన ఆహార పదార్థాలు ఈ మూడుగుణాల్లో దేన్నో ఒకదాన్ని పెంపు చేసేవిగా ఉంటాయని భగవద్గీత ప్రతిపాదించింది. మన ఆహారమే మన నడవడికి మూలం. ‘ఆహారం సైకాలజీ’ శాస్త్ర పితామహుడు వ్యాసులవారే!

  1. సాత్విక ఆహారం:

‘‘రస్యాః’’Rపాలు, పంచదార లాంటివి. ‘‘స్నిగ్ధాః’’ R వెన్న నెయ్యి లాంటివి. స్థిరః ఎక్కువ కాలం ప్రభావం ఉండే కేరట్‌, బూడిద గుమ్మడి లాంటివి, ‘‘హృద్యాః’’Rమనసుకు ఇంపుగా అనిపించేవి. ఇవన్నీ ఆయుష్షుని, సత్త్వ అంటే ఉన్నత వ్యక్తిత్వం, ఆరోగ్యం, సుఖం, సంతృప్తి వీటిని వృద్ధి చేస్తాయి. అవి ఇష్టపడే వ్యక్తులు సాత్విక స్వభావులై ఉంటారన్నాడు. సాత్విక ఆహారం అంటే నాణ్యమైన ఆహారం అని!

దాని వలన మనలో సత్త్వగుణం ఉదయస్తుంది. పాలు, పంచదార, నెయ్యి తిన్నంత మాత్రాన మనుషులు సాత్వికులైపోతారా? అని అడగవచ్చు. లోకంలో ఇంకా మంచితనం బతికుందంటే, సామాజిక వ్యవస్థ నిలబడి ఉందంటే, మనుషులు కొంతైనా సాత్త్విక పదార్థాలు తీసుకుంటూ ఉండటమే కారణం.

  1. రాజస ఆహారం:

వేపుడు పదార్థాలు, మసాలాలు, ఉల్లి, వెల్లుల్లి, ఊరుగాయలు, మద్యపానం వంటివి ఆతురత, కోపం, వికారాల్ని పెంచుతాయి. ఈ రకమైన ఆహారాన్ని ఇష్టపడేవారు యుక్తి కన్నా అహంకారంతో నడిచే స్వభావం ఉన్న వాళ్లు. సమాజంలో హింస, శోకం, అసమానతలకు ఈ రాజస ఆహారమే కారణం. తన పైన తనకు అదుపు లేకుండా ప్రవర్తించే తత్వం రాజసం. ఇవి చింత, శోక, భయ దుఃఖాదుల్ని, బీపీ గుండె జబ్బులు కిడ్నీ జబ్బుల్ని కలిగిస్తాయి. మద్యపానం చేస్తే కామం లాంటి రాజస లక్షణాలు బయటకొస్తాయి. ఇలాంటి ఆహారాల్ని రాజసతత్త్వం కలిగిన వాళ్లే ఇష్టపడతారు. రాజస ఆహారంతోనే లోక కలహాలు! సమాజంలో పరివర్తన రావాలంటే ఈ రాజసాహారం గురించిన హెచ్చరిక ప్రజలకు బలంగా అందాలి

  1. తామస ఆహారం:

సగం పండిన పండ్లు, రుచిని కోల్పోయిన పదార్థాలు, దుర్వాసన కొడుతున్నవి, పాచిపోయినవి, సగం తిని వదిలేసినవి, అపవిత్ర, శుద్ధిలేని వాటిని తమోగుణ ప్రధానులే ఇష్టపడతారన్నాడు. యాతయామం= Rexpiry date దాటిపోయినవి గతరసం = రసహీనమైనవి, పోషకాల్లేని పిజ్జాలు, మైసూరు బజ్జీల్లాంటి జంక్‌ ఫుడ్స్‌ పూతీ = కుళ్లి పోయినవి, పుచ్చిపోయినవి, పర్యుషితంRతాజాదనం కోల్పోయినవి, నిన్ననెప్పుడో వండినవి ఇలాంటివి తమోగుణాన్ని పెంచుతాయి. తామసులే వీటిని ఇష్టంగా తింటారు. తమోగుణం జడత్వాన్నిస్తుంది. శరీరాన్ని, మనోబలాన్ని కూడా ఇవి దెబ్బతీస్తాయి. ఆలస్యం, అయోమయం, అధోగతి వీరి లక్షణాలు. లోకానికి ఏ విధంగానూ ఉపయోగ పడని నిరర్థకజీవులు!

గోబ్లిన్‌ మోడ్‌ అనే కొత్త పదాన్ని ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులో చేర్చారీ మధ్య. ఏదీ పట్టనితనం, దేనికీ స్పందించక పోవటం, ఎవరెలా పోతే మనకెందు కనుకోవటం ఇవి ‘గోబ్లిన్‌ మోడ్‌’లో ఉన్న వ్యక్తుల లక్షణాలు. తామస పదార్థాలు తింటే ఇలాంటి లక్షణాలు పెరుగుతాయి.

1903లో george walther groddeck  అనే జర్మన్‌ వైద్యుడు-శరీర ధర్మాలన్నీ మనిషి తినే ఆహారాన్ని బట్టే ఉంటాయని ఒక ప్రతిపాదన చేశాడు. మనసు లోపల ఉండే అంతశ్చేతన మూడు గుణాలు కలిగి ఉంటుందన్నాడు. 1923లో ‘‘ది ఈగో అండ్‌ ది ఇడ్‌’’ (Das Ich und das Es) అనే పుస్తకంలో ఫ్రాయిడ్‌ ఈ గ్రాడెక్‌ ద్వారానే తాను ఇడ్‌ (తమోగుణం), ఈగో(రజోగుణం), సూపర్‌ ఈగో లేదా ఈగో ఐడియల్‌ (సత్త్వగుణం) అనే త్రిగుణాల గురించి తెలుసుకున్నట్టు రాశాడు. గ్రాడెక్‌ గారిని ‘సైకో సొమాటిక్‌ మెడిసిన్‌’ కు అలాగే, ప్రాయిడ్‌ను సైకో ఎనాలిసిస్‌ సిద్ధాంతానికి పితామహులుగా ప్రకటించారు.

కానీ, వీళ్లకి కనీసం 2000 యేళ్ల క్రితమే సత్వరజస్తమో గుణాల గురించి చెప్పిన వ్యాసుల వారిని గానీ, సాంఖ్యులను గానీ, ఆయుర్వేద గ్రంథాలను గానీ విస్మరించారు.

ఆహారం – మనసు అనుబంధం

‘‘Can diet impact mental health?’’ అనే ప్రశ్న వైద్యరంగంలో చర్చలో ఉంది. ‘‘Although nutrition certainly does appear to have an impact, there are still many gaps in our knowledge’’  అంటే, ఆహారంలో ఉన్న పోషకాలు మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయన్నది స్పష్టమే, కానీ దాని స్థాయి, విధానం ఇంకా స్పష్టత కావాలి… అని రాస్తున్నారు ఆధునిక పరిశోధకులు. ఆ స్పష్టతని ఆయుర్వేద గ్రంథాలిస్తు న్నాయి.

న్యూట్రిషనల్‌ సైకియాట్రీ అనే ఆధునిక శాఖ ‘‘Food & Mood’’ అనే విషయమై పరిశోధిస్తూ, కాఫీ, పంచదార, పసుపు, మిర్చి, కాకరకాయ వంటి పదార్థాలలోని రసాయనాలు మెదడు చర్యలపై ప్రభావం చూపుతున్నాయని కనుగొంది.

గోథెన్‌బర్గ్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ సుజన్నె డిక్సన్‌ ‘‘Poor diet is junk for the brain – it may lead to mental disorders’’ నిస్సారమైన ఆహారం మానసిక అయోమయ స్థితికి దారితీస్తుందని పేర్కొన్నాడు!

ఆహారంతోనే డిప్రెషన్‌, ఆందోళన, ఆలోచనా స్పష్టతపై ప్రభావం ఉంటుందని కొత్త శాస్త్ర శాఖ ‘‘న్యూట్రిషనల్‌ సైకియాట్రీ’’ చెబుతుంది: ఆహారం శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుందని, తినేది ఏమిటన్నదానితో పాటు, ఎలా, ఎంత ఎప్పుడెప్పుడూ అన్నది కూడా తగినంత విజ్ఞతతో నిర్ణయించాలని ఆయుర్వేదం చెప్తుంది.

ఒక్క చిన్న ఉదాహరణతో ఈ విషయాన్ని మరింత తేలికగా బోధపరచవచ్చు:

పంచదార తినంగానే శరీరానికి ఉత్తేజం, మనసుకు ఆనందం కలుగుతాయి. కానీ, మళ్లీమళ్లీ తినాలనే యావ పెరిగి తీపిని వ్యసనంగా మార్చు తుంది. Knüppel et al., Scientific Reports, 2017: అధిక చక్కెర డిప్రెషన్‌, ఆందోళనకు కారణం అని పేర్కొంది!

‘‘యద్దుఃఖం చ మోహం చ, యత్‌ తామసం ప్రోచ్యతే’’ మోహం, దుఃఖం కలిగించే ఆహారం తామసికం. సాత్వికమైన చక్కెర తినే విషయంలో నియంత్రణ కోల్పోతే షుగరు పెరగటమే కాదు, డిప్రెషన్‌ కూడా కలుగుతుందని హెచ్చరిస్తోంది!

భోజనం ఓ తపస్సు

భోజనం అనేది కడుపు నింపటం, పోషించడా లకే కాదు, అది మానసిక పరిపక్వతకు కూడా కారణం అవుతోంది. ఆరోగ్యదాయక భోజన సమృద్ధి ఒక తపఃఫలం. నాణ్యత లేని జంక్‌ పదార్థాలను ఆబగా తినేవారికి ఎంత డబ్బున్నా ఆ తపఃఫలం దక్కదు.

‘భోజనశక్తి’ కూడా తపఃఫలమే! వ్యాధులతో సహజీవనం చేస్తూ, షడ్రసోపేత భోజనానికి దూరమైనవారు ఈ తపఃఫలాన్ని కోల్పోతారు. ఆరోగ్యకర ఆహారం పొందటం, సంతుష్టిగా తినటం, ఆహారం మంచిచెడులు అందరికీ చాటి చెప్పటం, అన్నార్తులకు అన్నదానం చేయటం ఇవన్నీ తపఃఫలాలు.

‘‘ఓజస్తేజోద్యుతిధరు’’డని భగవంతుణ్ణి పిలుస్తారు. ఓజస్సు(ప్రాణబలం), తేజస్సు (దేహబలం), ద్యుతి (దేహకాంతి) ఈ గుణాలన్నీ అన్నం వలనే సిద్ధిస్తాయి. అన్నం దేవుడి స్వరూపం. మంచి మనసుని, ఆరోగ్యాన్ని, ఆయు వునీ ఇస్తుంది. వీర్యపుష్టీ, బలం, శరీరకాంతి పెరుగుతాయి. దప్పిక, తాపం, బడలిక, అలసట తగ్గుతాయి.

‘‘అన్నం వృత్తికరాణాం శ్రేష్టః’’- పోషకాల్లో అన్నమే శ్రేష్టమైందన్నాడు చరకుడు. ‘‘న చ ఆహారసమం కించిత్‌ భైషజ్యం ఉపలభ్యతె’’ ఆహారంతో సమానమైన ఔషధం లేదని కూడా ప్రకటించాడు. మన వైద్యులు ఆహార ఔషధాలను వదిలి, కేవలం మందులతో రోగాల్ని తగ్గించాలని చూడటం వలన మామూలు రోగాలు కూడా దీర్ఘవ్యాధులుగా మారిపోయి, వైద్యం అనేది ఖరీదైన అంశం అయింది.

అన్నానికి కొన్ని లక్ష్యాలు, లక్షణాలు ఉన్నాయి. ఆరోగ్యవంతుడి ఆరోగ్యాన్ని కాపాడటం, అనారోగ్యాన్ని తగ్గించటమే దీని లక్ష్యం, లక్షణం కూడా! అన్నం లేనిది జీవనం లేదు. ఔషధ గుణాల లేనిది అన్నం కాదు. మన వంటపద్ధతులు కేవలం రుచి కోసం కాదు.  శక్తి, సుఖం, సార్ధకమైన జీవనానికోసం.

అన్నం అంటే ఆకలి కోసం కాదు. అది శరీరానికి శక్తి, మనసుకు మైత్రి, జీవితానికి దిక్సూచి.

మన పూర్వులు ఆహారాన్ని ఔషధంగా చూశారు. దానిలోని శక్తిని అశ్వశక్తిగా గుర్తించారు శరీరానికే కాదు, మనసుకీ, ఆత్మకు కూడా జీవం ఇస్తోంది! అన్నం ఓ రుచి కాదు ఔషధం! ఓ అలవాటు కాదు జీవన శక్తి! ఓ ఆడంబరం కాదు ఆరోగ్యం! అదిజీవనశక్తి, పునరుత్పత్తి శక్తికి అనుసంధానం! అందుకే, అన్నానికి దణ్ణం!

– డా॥ జి.వి. పూర్ణచందు,

 ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యులు,

విజయవాడ