News

నిదా ఖాన్ కోసం గాలింపు చర్యలు..

32views

నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో బలవంతపు మత మార్పిడి, లైంగిక వేధింపుల కేసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బలవంతపు మత మార్పిడి కేసులో నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్ ఆచూకీ మాత్రం ఇంత వరకూ తెలియరాలేదు. పోలీసు బృందాలు ఆమె కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశాయి. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేయగా.. నిదా మాత్రం వారం రోజులుగా పరారీలో ఉంది.

నిదా ఖాన్ ఎక్కడుందనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఆమె భర్త మోయిన్ నవీద్ ఇక్బాల్ ఖాన్‌ను ప్రశ్నించారు. ఏప్రిల్ 14న ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని పోలీసులకు వివరించాడు. ఆమె తన బంధువుల కుటుంబం వద్ద ఉన్నట్లు పేర్కొన్నాడు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా.. ఇంటికి తాళం వేసి ఉండడంతో షాక్ అయ్యారు. నిదా ఖాన్, ఆమె బంధువుకి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది.

మరోసారి ఖాన్ భర్తను సంప్రదించగా.. ఈ వారం మొదట్లో ఖాన్ అత్త నూరీ షేక్ ఆమెను నాసిక్‌కు తీసుకెళ్లిందని పోలీసులకు తెలిపాడు. కానీ, ప్రస్తుతం తన భార్య ఎక్కడ ఉందో తెలియదని పేర్కొన్నాడు. కాగా, నిదా ఖాన్‌ భర్త మోయిన్ నవీద్ ఇక్బాల్ ఖాన్ థానేలోని ముంబ్రాలో అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో లాజిస్టిక్స్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేస్తున్నారు.

మరోవైపు నిదా ఖాన్ కుటుంబం నాసిక్ కోర్టును ఆశ్రయించింది. ఆమె గర్భిణిగా ఉందని, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. నిదా ఖాన్‌పై తీవ్రమైన ఆరోపణలు లేవని, తప్పకుండా బెయిల్ వస్తుందని ఆమె తరఫు న్యాయవాది ధీమా వ్యక్తం చేశారు.