
సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశమందిరంలో మే 10న జరగనున్న చందనోత్సవం ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. గతేడాది జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారిక ప్రొటోకాల్ పరిధిలోని వాహనాలను మాత్రమే కొండపైకి అనుమతించాలన్నారు. తొలిపావంచా నుంచి భక్తులను ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల్లో కొండపైకి తరలించాలని ఆదేశించారు. రూ.1500, రూ.1000, రూ.300 టికెట్లు అందుబాటులో ఉంటాయని, నగర పరిధిలో ఆరేడుచోట్ల కౌంటర్లు ఏర్పాటు చేసి అమ్మకాలు చేపట్టాలన్నారు.
ఎన్నికల నియమావళి ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎటువంటి ప్రొటోకాల్ ఉండదని స్పష్టం చేశారు.అంతరాలయ దర్శనాలు తెల్లవారుజామున 3.30గంటల నుంచి 4.30గంటల వరకు మాత్రమే ఉంటాయని, అదీ అధికార ప్రొటోకాల్ పరిధిలో ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామన్నారు. భక్తుల తాకిడికి తగ్గట్టుగా చలువ పందిళ్లు, ఇతర వసతులు కల్పించాలని ఆదేశించారు. ప్రైవేటు వాహనాలను కొండపైకి అనుమతించబోమని స్పష్టం చేశారు. మే 9వ తేదీ సాయంత్రం 6గంటల నుంచి స్వామి వారి దర్శనాలను నిలిపివేస్తారని కలెక్టర్ తెలిపారు. నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ మాట్లాడుతూ భద్రతకు 3వేల మంది సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు





