
న్యూఢిల్లీ: దేశానికి రాజ్యాంగమే అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సుప్రీంకోర్టులో శనివారం ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటూ సుప్రీం కోర్టు ఇ-ఇనిషియేటివ్ (వర్చువల్ జస్టిస్ క్లాక్, జస్టిస్ మొబైల్ యాప్ 2.0, డిజిటల్ కోర్టు, ఎస్3వాస్ వెబ్‌సైట్‌లు)లను ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని క్రమం తప్పకుండా బలోపేతం చేస్తున్నామని చెప్పారు. రాజ్యాంగ సభలోని మహిళల త్యాగాల గురించి చర్చ చాలా అరుదుగా ఉంటుందని, కనుక వారి గురించి యువతకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. రాజ్యాంగ అసెంబ్లీలో 15 మంది మహిళలు ఉన్నారు. వారిలో వెనుకబడిన సమాజానికి చెందిన దాక్షాయణి వేలాయుధన్ కూడా ఉన్నారని ప్రధాని చెప్పారు.
ప్రాథమిక విధులను నిర్వర్తించడమే పౌరులకు మొదటి ప్రాధాన్యతగా ఉండాలని పేర్కొంటూ ‘‘వ్యక్తులు గానీ, సంస్థలు గానీ.. మన ప్రాథమిక విధులే మనకు మొదటి ప్రాధాన్యం… ప్రతి ఒక్కరూ తమ విధులను సమర్థంగా నిర్వహించడం ద్వారా దేశాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
Source: Nijamtoday





