లండన్: బ్రిటన్‌కు పెరుగుతున్న వలసలను నియంత్రించే ప్రయత్నంలో విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించడంతోసహా అన్ని అవకాశాలను బ్రిటన్ ప్రధానిరిషి సునాక్ పరిశీలిస్తున్నారు. తక్కువ నాణ్యత కలిగిన డిగ్రీలు చదివే విదేశీ విద్యార్థులపై, వారు డిపెండెంట్లను తీసుకురావడంపై ఆంక్షలు విధించాలని సునాక్ యోచిస్తున్నారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి తెలిపారు.
అయితే, తక్కువ నాణ్యత కలిగిన డిగ్రీ అంటే ఏమిటనేది ఆయన నిర్వచించలేదు. ఈ ఆంక్షలు ఏమిటి? అన్నదానిపై స్పష్టత లేదు. బ్రిటన్‌లోని అంతర్జాతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. దీంతో వలసలపై బ్రిటన్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే భారతీయులపైనే అధిక ప్రభావం పడే అవకాశం ఉన్నది.
ఈ వారంలో తాజాగా జాతీయ గణాంకాల కార్యాలయం (ఒఎన్‌ఎస్) విడుదల చేసిన వలసలు, శరణార్థుల సంఖ్య పట్ల బ్రిటన్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. 2021లో బ్రిటన్‌కువచ్చిన వారి సంఖ్య 1,73,000గా వుండగా, ఈ ఏడాది ఒక్కసారిగా 5,04,000కి పెరిగిపోయింది. అంటే 3,31,000మంది పెరిగారు. దీనిపై ఆందోళన చెందుతున్న రిషి సునాక్ ప్రభుత్వం.. వలసలను నియంత్రించేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నది.
దీనిలో భాగంగా విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించడం సహా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలపై దృష్టి సారిస్తున్నట్టు బీబీసీ వార్తా సంస్థ వెల్లడించింది. విదేశీ విద్యార్ధుల సంఖ్యను నియంత్రించడం ద్వారా వలసల సంఖ్యను కుదించడమనేది చాలా సంక్లిష్టమైన సవాలుగా ఉంది. బ్రిటీష్ విద్యార్థుల నుంచి తక్కువ ఫీజు తీసుకోవడం వల్ల పోగొట్టుకుంటున్న డబ్బును అంతర్జాతీయ విద్యార్థుల నుంచి వసూలు చేయాలని బ్రిటీష్ యూనివర్శిటీలు భావిస్తుంటాయి.
ఇప్పుడు విదేశీ విద్యార్థులపై పరిమితులు విధిస్తే కొన్ని వర్సిటీలు దివాళా తీసే ప్రమాదం కూడా ఉందని బీబీసీ తెలిపింది. వలసదారుల గణాంకాల నుంచి విదేశీ విద్యార్థులను తొలగించాలని ఎన్‌ఐఎస్‌ఏయూ (నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని) అధ్యక్షుడు సనం అరోరా డిమాండ్ చేశారు. భారత సంతతికి చెందిన సునాక్ అధికారంలోకి రావడం వల్ల భారతీయులకు ప్రయోజనాలు కలుగుతాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో తాజాగా వస్తున్న వార్త భారతీయ విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది.
Source: Nijamtoday