
న్యూఢిల్లీ: పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లలో సరిహద్దు దాటి డ్రోన్ ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలను పంపే కేసులు ఈ ఏడాదిలో రెట్టింపు అయ్యాయని సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. అదేస్థాయిలో ఉగ్రదాడులను భద్రత బలగాలు తిప్పికొడుతున్నాయని, పొరుగు దేశం ప్రతి కుట్రను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.
2020లో భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 79 డ్రోన్స్ సంచరించినట్టు బీఎస్ఎఫ్ గుర్తించగా, అది గత ఏడాది(2021)లో సంఖ్య 109కి పెరిగింది. ఈ ఏడాది సంఖ్య రెట్టింపు అయిందనీ, ఈ ఏడాదిలో 266 డ్రోన్స్ సంచరించినట్టు ఆయన తెలిపారు. అందులో పంజాబ్‌లో 215 డ్రోన్స్ కేసులు నమోదు కాగా, జమ్మూలో దాదాపు 22 డ్రోన్స్ కేసులు నమోదయ్యాయని సింగ్ చెప్పారు.
ఈ డ్రోన్స్ ద్వారా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నకిలీ కరెన్సీ తరలిస్తున్నట్టు తెలిపారు. రోజురోజుకు ఈ సమస్య తీవ్రమవుతుందని పేర్కొన్నారు. అందులో సెప్టెంబర్,అక్టోబర్ నెలలో పాకిస్తాన్ నుండి పంపిన 191 డ్రోన్‌లను బిఎస్‌ఎఫ్ అడ్డగించిందని, అందులో 171 డ్రోన్‌లు పంజాబ్ సరిహద్దు నుండి భారతదేశంలోకి ప్రవేశించగా, 20 డ్రోన్‌లు సరిహద్దు దాటి జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేశించాయని వెల్లడించారు.
Source: Nijamtoday





