News

సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు సర్వీస్?

388views

న్యూఢిల్లీ: కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలు త్వరలో ఆంధ్రాను పలకరించనుంది. ఇప్పటికే ఐదు సర్వీస్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తమ్మీద 400 వరకు వందే భారత్ రైళ్ళు రానున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

తెలంగాణలో కూడా ఈ వందే భారత్ రైలు సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు. ముందుగా సికింద్రాబాద్ నుంచి తిరుపతి లేదా బెంగళూరు, ముంబై ప్రాంతాలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో బెర్త్‌లు ఉండవు. కేవలం కూర్చోని మాత్రమే ప్రయాణం చేసేలా సీటింగ్ ఉంటుంది. దీని వల్ల దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారికి అసౌకర్యంగా ఉంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు ఎక్కువసేపు కూర్చోని ప్రయాణం చేయడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే దగ్గర ప్రాంతాలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది.

అందులో భాగంగా సికింద్రాబాద్-విజయవాడ స్టేషన్ల మధ్య సర్వీస్‌ను నడిపించాలని రైల్వే శాఖ అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్-విజయవాడ మధ్య ఎక్కువమంది ప్రయాణం సాగిస్తూ ఉంటారు. ఈ రూట్‌లో ప్రయాణికుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక పండగల సమయంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రూట్‌లో సర్వీస్ నడిపితే బాగుంటుందని ఆలోచిస్తుంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విజయవాడ మధ్య ప్రయాణానికి ఆరు గంటల సమయం పడుతోంది. అదే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపిస్తే నాల్గు గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటారు. ప్రయాణికులకు కూడా రిలాక్స్ అవుతారని రైల్వే అధికారులు ఆలోచిస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన తెలుపనున్నట్టు రైల్వే చెబుతోంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి