News

మానవాళి మంచి కోసమే ట్విటర్‌ను కొనుగోలు చేశా: ఎలాన్‌ మస్క్‌

347views

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ను తాను డబ్బు కోసం కొనుగోలు చేయడం లేదని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ అన్నారు. తాను ప్రేమించే మానవాళి మంచి కోసమే సామాజిక మాధ్యమాన్ని సొంతం చేసుకుంటున్నట్టు తెలిపారు.

ఆరోగ్యకరమైన చర్చకు అందరికీ ఓ ఉమ్మడి వేదికను తీసుకురావడమే తన ఉద్దేశమని వివరించారు. ట్విటర్‌ కొనుగోలు ప్రక్రియను మస్క్‌ పూర్తిచేశారన్న వార్త బయటకు రావడానికి ముందే ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రకటనదారులను ఉద్దేశిస్తూ ఓ సందేశాన్ని ట్విటర్‌లో ఉంచారు.

”ట్విటర్‌ను కొనాలనే నిర్ణయం వెనకున్న నా ఉద్దేశాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నా. ట్విటర్‌ను నేను ఎందుకు కొంటున్నాను.. ప్రకటనలపై నా ఉద్దేశానికి సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిలో నిజం లేదు. రాబోయే తరానికి ఓ ఉమ్మడి డిజిటల్‌ వేదిక ఉండడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన వాతావరణంలో అనేక అంశాలపై చర్చించుకునేలా అది ఉండాలి. హింసకు తావుండొద్దు. ప్రస్తుతం ఉన్న సామాజిక మాధ్యమాలు రెండు భిన్న ధ్రువాలుగా విడిపోయి విద్వేషం, విభజనను ప్రోత్సహించేలా మారే ప్రమాదం ఉంది. దీంతో చర్చకు అవకాశం లేకుండా పోతోంది. అందుకోసమే నేను ట్విటర్‌ను కొనుగోలు చేశాను. డబ్బు కోసం కాదు. నేను ప్రేమించే ఈ మావనవాళికి సాయం చేయడం కోసమే కొన్నాను. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోకుండా ఏదైనా చెప్పడానికి అందరికీ ట్విటర్‌ ఉచిత వేదిక కాబోదు. నిబంధనలు, చట్టాలకు కట్టుబడి ఉంటూనే అందరికీ అందుబాటులో ఉండాలి. అన్ని వర్గాలకు నచ్చిన ఎంపికలను అందించేలా తీర్చిదిద్దాలి” అని మస్క్‌ తన సందేశంలో తెలిపారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి