News

కశ్మీర్‌ను వేరే దేశమన్న బీహార్‌ విద్యాశాఖ!

444views

పట్నా: భారతదేశంలోని కశ్మీర్‌ను బీహార్‌ విద్యాశాఖ వేరే దేశమని అనుకుంటోంది. అంతేకాదండోయ్‌… తాము రూపొందించి ఓ పరీక్షల్లో కశ్మీర్‌ దేశంలో నివసించే ప్రజలను ఏమని పిలుస్తారు? అని ఓ ప్రశ్న సంధించింది. ఈ పరిణామానికి నివ్వెరపోవడం విద్యార్థుల వంతయింది.
బీహార్‌లో జరుగుతున్న అర్ధవార్షిక పరీక్షల్లో ఏడో తరగతి ప్రశ్నా పత్రంలో ఈ ప్రశ్న ఉన్నది. దీనికి రెండు మార్కులు కూడా కేటాయించారు. ప్రశ్నపత్రం రూపొందించిన వారి నిర్లక్ష్యవైఖరి వల్ల ఇప్పుడు ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నది. ఏకంగా ప్రభుత్వ ఎడ్యుకేషన్‌ ప్రాజెక్టు కౌన్సిల్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షల్లో ఇలాంటి తప్పులు రావడమేంటని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

కిషన్‌గంజ్‌ జిల్లాలో పాఠశాల విద్యార్థులకు అర్ధవార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏడో తరగతి ప్రశ్నపత్రంలోని మొదటి బిట్టులో.. కింది దేశాల్లో నివసించే ప్రజలను ఏమని పిలుస్తారు అని అడిగారు. అందులో ఐదు ప్రశ్నలు అడిగారు.

మొదటి ప్రశ్నలో చైనాలో నివసించే వారిని ఏమంటారని, తర్వాత నేపాల్‌, ఇంగ్లండ్‌ దేశ ప్రజలను ఏమని పిలుస్తారనే ప్రశ్నలు అడిగారు. నాలుగో ప్రశ్నగా కశ్మీర్‌ ప్రజలను ఏమంటారని, ఐదో ప్రశ్నలో ఇండియాలో నివసించేవారిని ఏమని పిలుస్తారని అడిగారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ఇందులో మొదటి ప్రశ్నకు అందులోనే జవాబు ఇచ్చారు. మిగిలిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాలని కోరారు.

అయితే, కశ్మీర్‌ ప్రత్యేక దేశంగా ఎప్పుడు ఏర్పడిందని విద్యార్థులు ఆశ్చర్యపోయారు. ఇదే విషయాన్ని ఇన్విజిలేటర్‌ దృష్టికి తీసుకువెళ్ళారు. అప్పుడుగాని జరిగిన పొరబాటును ఉపాధ్యాయులు గుర్తించలేకపోయారు. ఈ విషయంపై ఆశా లతా మిడిల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఎస్కే దాస్ స్పందిస్తూ.. తమకు ఈ ప్రశ్నపత్రం ప్రభుత్వం నుంచి అందిందని చెప్పారు. కశ్మీర్‌లో నివసించే ప్రజలను ఏమని పిలుస్తారనేదానికి బదులు ‘పీపుల్‌ ఆఫ్‌ కంట్రీ ఆఫ్‌ కశ్మీర్‌’ అని తప్పుగా పడిందన్నారు. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

Source: Namsteindia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి