News

హిజాబ్‌ చిక్కుల్లోపడ్డ ఇరాన్‌ మహిళా అథ్లెట్‌ ఎల్నాజ్‌ రెకాబి

198views

సియోల్‌: ఇరాన్‌ మహిళా అథ్లెట్‌ ఎల్నాజ్‌ రెకాబి (33) ‘హిజాబ్‌’ చిక్కుల్లో పడ్డారు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఐఎఫ్‌ఎస్‌సీ ఆసియా ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఆమె వెళ్ళారు. అయితే, ఆదివారం హిజాబ్‌ ధరించకుండా అధిరోహణ పోటీల్లో పాల్గొనడంతో ఎల్నాజ్‌ మంగళవారం ఉదయం ఆగమేఘాలపై సియోల్‌ వీడి వెళ్ళారు. ఇరాన్‌ అధికారులే ఒత్తిడి తీసుకువచ్చి ఆమెను వెనక్కు పిలిపించారని, అక్కడికి చేరగానే ఎల్నాజ్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందని పార్శీ భాషా పత్రిక ఒకటి పేర్కొంది. ఈ కథనాన్ని ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ వర్గాలు ఖండించాయి. వివిధ క్రీడాపోటీల్లో పలు పతకాలు గెలిచిన ఎల్నాజ్‌ హిజాబ్‌ వివాదంపై స్వదేశంలో పేట్రేగుతున్న ఆందోళనల్లో భాగంగానే తలకు వస్త్ర ఆచ్ఛాదన లేకుండా అధిరోహణ పోటీల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఎల్నాజ్‌ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ‘హిజాబ్‌ ధరించకపోవడం అనుకోకుండా జరిగిన ఘటన’గా పేర్కొంటూ పోస్టు పెట్టారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి