
కాబుల్: తాలిబన్ల చేతిలో అవమానకర మరణం తప్పదని భయపడిన ఓ మహిళ ముందుగానే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అఫ్గానిస్థాన్‌లో చోటుచేసుకొంది. ఈ విషయాన్ని స్థానిక మీడియా సంస్థ ఖామా ప్రెస్ పేర్కొంది. పెళ్లైన ఓ వ్యక్తిని ఇష్టపడిన మహిళ అతడితో కలిసి వెళ్లిపోయింది. ఈ ఘటనపై ఆగ్రహించిన తాలిబన్లు ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని తీర్పునిచ్చారు. నలుగురిలో అవమానకరంగా చనిపోవడం ఖాయమని ఆ మహిళ భావించింది. దీంతో తాలిబన్లు శిక్షను అమలు చేయడానికి ముందే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై ఘోరీ ప్రావిన్షియల్ పోలీస్ చీఫ్ అబ్దుల్ రహ్మన్ మాట్లాడుతూ.. మహిళల జైళ్ల కొరత ఉండటంతో బహిరంగంగా రాళ్లతో కొట్టాలని తీర్పునిచ్చినట్టు చెప్పాడు.
ఇటీవల కాలంలో ఈ ప్రావిన్స్‌లో చాలా మంది మహిళలు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లువదిలి వెళ్లిపోతుండటంతో తాలిబన్లు వారిని రాళ్లతో కొట్టి చంపడం లేదా బహిరంగంగా ఉరితీయడం వంటి శిక్షలు విధిస్తున్నారు. ఇటీవల కాలంలో అఫ్గానిస్థాన్‌లో విద్యాసంస్థలు, పనిప్రదేశాల్లో మహిళలపై ఆంక్షలు పెరిగిపోయాయి. మీడియా రంగంలో ఏకంగా 80 శాతం మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయారు. దీంతోపాటు వైద్య, విద్యా, సామాజిక సేవ రంగాల్లో చాలా మంది మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించారు. తాలిబన్ల అనుమతి లేకుండా ఘోరీ ప్రావిన్స్‌లో మహిళలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, ట్యాక్సీల్లో ఎక్కడంపై కూడా నిషేధం విధించినట్టు ఖామా న్యూస్ పేర్కొంది.
Source: Nijamtoday





