News

కరోనా టీకాల ప్రక్రియ కొంతకాలం నిలిపివేత

376views

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కరోనా టీకాల సేకరణను కొంతకాలం నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు కేటాయించిన బడ్జెట్‌ను ఆర్థిక శాఖకు సరెండర్ చేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 2022-23 బడ్జెట్‌లో వ్యాక్సినేషన్ కోసం చేసిన కేటాయింపులో ఇది 85 శాతం కావడం గమనార్హం.

మూడో డోసు వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద సుమారు 1.8 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మరో ఆరు నెలల పాటు వ్యాక్సినేషన్‌ను కొనసాగించేందుకు ఇవి సరిపోతాయని అంచనా. ఒకవేళ ప్రభుత్వం దగ్గర ఉన్న నిల్వలు నిండుకుపోయినా, మార్కెట్లో వీటి లభ్యత ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో కరోనా టీకాల డోసులను సేకరించాలా? వద్దా? అనే విషయమై ఆరు నెలల తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జనవరి 16, 2021న దేశ వ్యాప్తంగా మొదలు పెట్టిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితం గానే టీకాలు అందిస్తోంది. ఇప్పటివరకు 219 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి