
న్యూఢిల్లీ: భారత్-చైనాలను యుద్ధం అంచువరకూ తీసుకెళ్లి.. లక్షల మంది సైనికులు సరిహద్దుల్లో మోహరించేందుకు కారణమైన గల్వాన్ ఘర్షణను షీ జిన్‌పింగ్ ఘనతగా సీసీపీ ప్రచారం చేస్తోంది.
చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) 20వ జాతీయ మహాసభ వేదికపైకి పార్టీ జనరల్ సెక్రటరీ జిన్‌పింగ్ రావడానికి కొద్దిసేపటి ముందు.. పదేళ్లలో ఆయన సాధించిన విజయాలను ప్రదర్శించారు. ఈ క్రమంలో దేశీయ ప్యాసింజర్ జెట్ విమానం, అంతరిక్ష పరిశోధనలతోపాటు.. గల్వాన్‌లో భారత్-చైనా దళాల ఘర్షణను కూడా చూపించారు. ఈ చిత్రాల్లో పీఎల్‌ఏ కమాండర్ క్వీ ఫాబోవా రెండు చేతులు అడ్డంగా పెట్టి భారత దళాలను ఆపుతున్న దృశ్యాన్ని ప్రదర్శించారు.
గల్వాన్ ఘర్షణ తర్వాత నుంచి చైనా ప్రచార విభాగం ఈ చిత్రాన్ని విపరీతంగా అక్కడి ప్రజల్లోకి తీసుకెళ్లింది. సదరు పీఎల్‌ఏ కమాండర్ క్వీ ఫాబోవా కూడా ది గ్రేట్ హాల్ ఆప్ పీపుల్స్‌లో జరుగుతున్న సీసీపీ జాతీయ మహాసభకు హాజరయ్యాడు. గల్వాన్ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు అతడు గ్రేట్ హాల్లోనే ఉన్నాడు. దేశవ్యాప్తంగా సీసీపీ ఎన్నిక చేసిన 2,296 మంది ప్రతినిధుల్లో అతడు కూడా ఒకరు.
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో టార్చ్‌బేరర్‌గా క్వీ ఫాబోవాను ఎంపిక చేసింది. అప్పట్లో చైనా తీసుకున్న నిర్ణయంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకల్లో చైనాలోని భారత రాయబారి పాల్గొనలేదు. ఈ విశ్వక్రీడల ప్రారంభ, ముగింపు వేడుకలను ‘దూరదర్శన్’ ప్రసారం చేయలేదు. అప్పట్లో అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన ఈ ఎంపికను అమెరికా సైతం తప్పుపట్టింది.
Source: Eenadu





