News

‘ఆపరేషన్​ పీఎఫ్​ఐ’ ముమ్మరం.. 8 రాష్ట్రాల్లో ఎన్​ఐఏ, ఈడీ దాడులు!

1.3kviews

న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా-పీఎఫ్​ఐపై కేంద్ర సంస్థలు మరోమారు గురిపెట్టాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ-ఎన్​ఐఏ, ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​-ఈడీ మంగళవారం ఉదయం సంయుక్త ఆపరేషన్​ చేపట్టాయి. ఎనిమిది రాష్ట్రాల్లో పీఎఫ్​ఐ సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అసోంలో ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్​లో కేంద్ర నిఘా సంస్థ-ఐబీ, ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా భాగమైనట్టు ఎన్​ఐఏ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. మరోవైపు.. కర్ణాటకలో 40 మందికిపైగా అదుపులోకి తీసుకున్నట్టు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు.

పీఎఫ్​ఐ లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయడం గత రెండు వారాల్లో ఇది మూడోసారి.సెప్టెంబర్ 22న దేశవ్యాప్తంగా ఎన్​ఐఏ విస్తృత సోదాలు నిర్వహించింది. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై 11 రాష్ట్రాల్లోని 106 మంది పీఎఫ్​ఐ కార్యకర్తలను అరెస్టు చేసింది.

కేరళలో అత్యధిక అరెస్టులు జరిగాయి. దాదాపు 22 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక (20), తమిళనాడు(10), అసోం(9), ఉత్తరప్రదేశ్(8), ఆంధ్రప్రదేశ్(5), మధ్యప్రదేశ్(4) , పుదుచ్చేరి, ఢిల్లీ(3) రాజస్థాన్(2)లోనూ పలువురిని అరెస్టు చేసింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి